Jharkhand: జార్ఖండ్‌లో ఇండియా కూటమికి ద్రోహం?.. రాజ్యసభ ఎన్నికల్లో పరిమళ్ నత్వాని సంచలన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికలు అనూహ్య రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచాయి. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, సొంత కూటమిలోనే చోటుచేసుకున్న క్రాస్ ఓటింగ్ కారణంగా ఇండియా కూటమికి గట్టి షాక్ తగిలింది. అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం ఎన్‌డీఏ వ్యూహానికి అనుకూలంగా మారడంతో, స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వాని సంచలన విజయాన్ని నమోదు చేశారు. సంఖ్యాబలం ఉన్నా ఫలితం మారింది 81 మంది సభ్యులున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో అధికార ఇండియా కూటమికి 56 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ బలం ప్రకారం రెండు రాజ్యసభ స్థానాలనూ సులువుగా గెలుచుకోవాల్సి ఉన్నప్పటికీ, కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం, క్రాస్ ఓటింగ్ కారణంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
వివరాలు
ఎన్‌డీఏ వ్యూహం ఫలించింది.. నత్వాని సంచలన విజయం
ఒక స్థానంలో జేఎంఎం అభ్యర్థి బైద్యనాథ్ రామ్ 30 ఓట్లతో సునాయాసంగా విజయం సాధించగా, మరో స్థానంలో పోరు ఉత్కంఠభరితంగా సాగింది. కేవలం 24 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఎన్‌డీఏ కూటమి వ్యూహాత్మకంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ పరిమళ్ నత్వానిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించింది. జూన్ 18న జరిగిన ఓట్ల లెక్కింపులో నత్వానికి 28 ఓట్లు లభించగా, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా కేవలం 20 ఓట్లకే పరిమితమయ్యారు. పోలైన ఓట్లలో మూడు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ ఫలితంతో ఎన్‌డీఏ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. అసెంబ్లీ ప్రాంగణంలో బీజేపీ కార్యకర్తలు విజయ సంబరాలు నిర్వహించారు.
వివరాలు
మోదీ, అమిత్ షాలకు నత్వాని కృతజ్ఞతలు
విజయం అనంతరం పరిమళ్ నత్వాని తనకు మద్దతుగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా,అలాగే జార్ఖండ్ బీజేపీ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాలుగోసారి రాజ్యసభకు ఎన్నిక కావడం,అందులోనూ ఝార్ఖండ్ నుంచి మూడోసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. సొంత కూటమిపైనే కాంగ్రెస్ ద్రోహం ఆరోపణలు ఈఫలితంపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.సొంత భాగస్వామ్య పక్షాల నుంచే ద్రోహం జరిగిందని ఆరోపించింది. కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్ కె.రాజు మీడియాతో మాట్లాడుతూ,తమ మిత్రపక్షాలైన ఆర్జేడీ,సీపీఎం పార్టీలు తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు. జేఎంఎం మాత్రం తమకు నాలుగు ఓట్లను బదిలీ చేసిందని చెప్పారు.ఈ అంశాన్ని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.
వివరాలు
మిజోరంలో జడ్‌పీఎం చరిత్ర
మరోవైపు, ఈశాన్య రాష్ట్రం మిజోరంలో అధికార జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జడ్‌పీఎం) కొత్త చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో జడ్‌పీఎం అభ్యర్థి కె. లాల్‌త్లువాంగ్‌కిమా 26 ఓట్లతో ఘన విజయం సాధించారు. దీంతో జడ్‌పీఎం తరఫున రాజ్యసభకు ఎన్నికైన తొలి ప్రతినిధిగా ఆయన రికార్డు సృష్టించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) అభ్యర్థి జోథాన్‌సంగి హ్మర్‌పై విజయం సాధించారు. ఈ ఫలితంతో మిజోరంలో జడ్‌పీఎం రాజకీయ బలం మరోసారి రుజువైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.