JN.1 covid variant: కేరళలో కరోనా కొత్త వేరియంట్ JN.1 గుర్తింపు.. దేశంలో కేసుల పెరుగుదల
ఈ వార్తాకథనం ఏంటి
కరోనా వైరస్ కొత్త సబ్-వేరియంట్ JN.1 మొదటి కేసు కేరళలో నమోదైంది. 79 ఏళ్ల మహిళ నమూనాను నవంబర్ 18న RT-PCR ద్వారా పరీక్షించగా.. ఆమెకు JN.1 వేరియంట్ సోకినట్లు అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి.
ఆ మహిళకు ఇన్ఫ్లూయెంజా లాంటి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, ఆమె ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశంలో 90 శాతానికి పైగా కోవిడ్ -19 కేసులు తీవ్రంగా లేవని, సోకిన వ్యక్తులు తమ ఇళ్లలో క్వారంటైన్‌లో ఉంటూ నయం చేసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు.
ఇంతకుముందు, తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన వ్యక్తికి సింగపూర్‌లోని ఒక భారతీయ ప్రయాణికుడికి JN.1 సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
కేరళ
ఓమిక్రాన్ నుంచి ఉద్భవించిన JN.1 వేరియంట్
JN.1 అనేది ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ BA.2.86నుంచి ఉద్భవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
ఈ వేరియంట్ ఇటీవల అమెరికా, యూకే, స్పెయిన్, ఐస్‌లాండ్, పోర్చుగల్ మొదలైన దేశాలలో వ్యాప్తి చెందుతోంది.
ఇప్పటివరకు, ఈ వేరియంట్ కేసులు ఇప్పటి వరకు 38దేశాలలో గుర్తించారు. వివిధ దేశాల్లో ఆస్పత్రుల చేరికకు ఈ వేరియంటే కారణమని అధికారులు చెబుతున్నారు.
కేరళలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వేరియంట్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.
భారతదేశంలో శుక్రవారం 312 కొత్త కోవిడ్-19కేసులు నమోదు కాగా, ఒక్క కేరళలోనే 24 గంటల్లో 280 కేసులు నమోదయ్యాయి.
దేశంలో ఇటీవల కేసుల పెరుగుదలకు JN.1 వేరియంట్ కారణమని ఐసీఎంఆర్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కో-ఛైర్‌పర్సన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ వెల్లడించారు.