JNTUA: జేఎన్‌టీయూఏ-జర్మనీ యూనివర్సిటీ ఒప్పందం.. ఐదేళ్లలోనే డ్యూయల్ డిగ్రీ
ఈ వార్తాకథనం ఏంటి
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూఏ) అనంతపురం గుడ్‌న్యూస్ చెప్పింది. జర్మనీకి చెందిన ప్రముఖ రైట్లింగెన్ నాలెడ్జ్ ఫౌండేషన్ యూనివర్సిటీతో జేఎన్‌టీయూఏ కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంటిగ్రేటెడ్ బీటెక్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సులను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఒకేసారి జేఎన్‌టీయూఏతో పాటు జర్మన్ యూనివర్సిటీ నుంచి కూడా డిగ్రీలను పొందే అవకాశం కల్పించనున్నారు.
వివరాలు
ఐదేళ్లలోనే రెండు డిగ్రీలు
ఈ ప్రత్యేక ప్రోగ్రామ్‌లో చేరిన విద్యార్థులు తొలి నాలుగేళ్లు జేఎన్‌టీయూఏ అనంతపురంలో బీటెక్ చదవాల్సి ఉంటుంది. అనంతరం చివరి ఏడాదిని జర్మనీలోని భాగస్వామ్య విశ్వవిద్యాలయంలో పూర్తి చేస్తారు. సాధారణంగా బీటెక్, ఎంఎస్ పూర్తి చేయడానికి ఆరేళ్లు పడుతుండగా.. ఈ ఇంటిగ్రేటెడ్ విధానం ద్వారా కేవలం ఐదేళ్లలోనే రెండు డిగ్రీలను పూర్తి చేసే అవకాశం లభించనుంది.
వివరాలు
అందించే కోర్సులు
బీటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) + ఎంఎస్ (ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్) బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) + ఎంఎస్ (డిజిటల్ బిజినెస్ మేనేజ్‌మెంట్) యూరప్‌లో ఉద్యోగ అవకాశాలు.. 100 శాతం ప్లేస్‌మెంట్స్ ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు అత్యాధునిక యూరోపియన్ టెక్నాలజీలపై అవగాహన పెరగడంతో పాటు యూరప్‌లో మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని జేఎన్‌టీయూఏ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్. సుదర్శన రావు తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో చేరే విద్యార్థులకు అత్యుత్తమ కెరీర్ అవకాశాలు ఉంటాయని, 100 శాతం ప్లేస్‌మెంట్స్ కల్పించే లక్ష్యంతో ఈ కోర్సులను రూపొందించామని ఆయన చెప్పారు.
వివరాలు
అర్హతలు ఏమిటి?
అలాగే జర్మనీలో విడిగా ఎంఎస్ చదివేందుకు అయ్యే వ్యయంతో పోలిస్తే.. ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా సుమారు 60 శాతం వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు. ఇంటర్మీడియట్, సీబీఎస్ఈ లేదా ఐసీఎస్‌ఈ సిలబస్‌లో ఎంపీసీ (గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం) విభాగంలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులని వర్సిటీ అధికారులు తెలిపారు. జేఎన్‌టీయూఏ ఫారిన్ ఎడ్యుకేషన్ అఫైర్స్ డైరెక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయం ఇప్పటికే స్వీడన్ యూనివర్సిటీతో కలిసి విజయవంతంగా కోర్సులను నిర్వహిస్తోందని తెలిపారు. అదే తరహాలో రానున్న విద్యా సంవత్సరం నుంచి జర్మనీ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఈ సరికొత్త ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
వివరాలు
కోర్సులకు సంబంధించిన మరింత సమాచారం కోసం..
అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ కోర్సులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే అభ్యర్థులు 7288733337 నంబర్‌ను సంప్రదించవచ్చని జేఎన్‌టీయూఏ అధికారులు తెలిపారు.