Page Loader
Indian Army New Act: త్రివిధ దళాలకు ఉమ్మడి కమాండ్.. ఇంటర్-సర్వీసెస్ చట్టానికి గెజిట్ నోటిఫికేషన్
త్రివిధ దళాలకు ఉమ్మడి కమాండ్.. ఇంటర్-సర్వీసెస్ చట్టానికి గెజిట్ నోటిఫికేషన్

Indian Army New Act: త్రివిధ దళాలకు ఉమ్మడి కమాండ్.. ఇంటర్-సర్వీసెస్ చట్టానికి గెజిట్ నోటిఫికేషన్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత త్రివిధ బలగాలకు మధ్య కమాండ్, కంట్రోల్, డిసిప్లిన్‌ను ఏకతాటిపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఇంటర్-సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్, కంట్రోల్ అండ్ డిసిప్లిన్) చట్టం - 2023' కు సంబంధించి నిబంధనలను కేంద్రం తాజాగా గెజిట్ ద్వారా నోటిఫై చేసింది. ఈ నిబంధనలు మే 27, 2025 నుండి భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లకు చెందిన పలు విభాగాల్లో అమల్లోకి వచ్చాయి.

Details

కమాండ్ సామర్థ్యాన్ని పెంచేందుకు చట్టం 

రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, త్రివిధ దళాల్లో సమిష్టి వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. 2023 వర్షాకాల సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించగా, 2023 ఆగస్టు 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీన్ని ఆమోదించారు. ఆపై 2024 మే 08న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగా, చట్టం మే 10, 2024 నుండి అమల్లోకి వచ్చింది.

Details

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కీలక నిర్ణయం 

ఈ నిబంధనల నోటిఫికేషన్, భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ తీసుకున్న దుష్పరిణామాలపై చర్యల నేపథ్యంలో కీలకంగా మారింది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించడంతో భారత్ మే 7న 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. భారత సైన్యం పాకిస్తాన్, పీఓకే ప్రాంతాల్లో 9 ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు చేసి విజయాన్ని సాధించింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ బలగాలు రెండు రోజుల పాటు డ్రోన్ దాడులకు యత్నించాయి. కానీ అప్రమత్తమైన భారత బలగాలు వాటిని అడ్డుకొని, పాక్ ఎయిర్ బేస్‌లపై ప్రతీకార దాడులు నిర్వహించాయి. ఈ దాడులకు తట్టుకోలేక పాక్ శాంతికి పిలుపు నిచ్చింది. అనంతరం మే 10న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని విక్రమ్ మిస్రీ వెల్లడించారు.

Details

 చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చౌహాన్ సమీక్ష

ఆపరేషన్ సిందూర్ అనంతరం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, భారత సైన్యానికి చెందిన ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని యుద్ధ సిద్ధతను సమీక్షించారు. ఈ సందర్భంగా రెండు కీలక బలగాల్ని ప్రత్యక్షంగా సందర్శించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో సాగిన ఆపరేషన్‌లను ఆయన ప్రశంసించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికుల ధైర్యం, సాహసాలు, నిర్ధిష్ట లక్ష్య సాధనలో చూపిన నైపుణ్యం దేశ రక్షణకు ఉన్న భారత బలగాల ప్రతిభకు నిదర్శనమని ఆయన కొనియాడారు.

Details

సమిష్టితత్వానికి నూతన దారులు తెరచిన చట్టం

ఇక తాజాగా అమల్లోకి వచ్చిన నిబంధనలతో, త్రివిధ బలగాల కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా జరిగేలా మారతాయి. కమాండర్‌లు, ఆఫీసర్-ఇన్-కమాండ్‌లు తమ పరిధిలో ఉన్న సిబ్బందిపై పరిపాలనా బాధ్యతలు, క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంటారు. అదే సమయంలో ఆయా దళాల ప్రత్యేక సేవా నిబంధనలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇవన్నీ కలిపి చూస్తే, ఈ చట్టం భారత త్రివిధ దళాల మధ్య ఐక్యత, ఆపరేషనల్ సమన్వయం, సమిష్టి సత్తా బలోపేతానికి మార్గదర్శిగా నిలవనుంది.