LOADING...
Rahul Gandhi:మహాకూటమి ప్రెస్ మీట్ పోస్టర్లలో మాయమైన రాహుల్ గాంధీ ఫొటో..కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదంటూ బీజేపీ నేతల ఎద్దేవా
కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదంటూ బీజేపీ నేతల ఎద్దేవా

Rahul Gandhi:మహాకూటమి ప్రెస్ మీట్ పోస్టర్లలో మాయమైన రాహుల్ గాంధీ ఫొటో..కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదంటూ బీజేపీ నేతల ఎద్దేవా

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష మహాకూటమిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కూటమి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పోస్టర్‌లలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫొటో మాయమవడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. పాట్నాలోని మౌర్య హోటల్‌లో నేడు జరగనున్న మీడియా సమావేశం పోస్టర్‌లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఫొటో ప్రముఖంగా చూపించారు. మిగతా భాగస్వామ్య పార్టీ నేతల చిన్న ఫొటోలు ఉన్నా,రాహుల్ గాంధీ ఫొటో ఎక్కడా కనిపించలేదు. ఈ పరిణామంపై బీజేపీ వెంటనే విమర్శలు ఎక్కుపెట్టింది.

వివరాలు 

కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదంటూ బీజేపీ నేతల ఎద్దేవా 

"నిన్నటి వరకు రాహుల్ గాంధీని కూటమి ముఖచిత్రంగా భావించేవారు. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఆ గౌరవం లేదు.ఈ కూటమికి లక్ష్యం,దార్శనికత ఏదీ లేదు. గందరగోళం, విభజన, పదవుల ఆశ తప్ప మరేదీ లేదు. ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేని పరిస్థితిలో ఉన్నారు" అని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. మరో బీజేపీ నేత ప్రదీప్ భండారి స్పందిస్తూ "తేజస్వి యాదవ్,ఆయన మద్దతుదారులు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అవమానించారు. మహాకూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య మహాభారతం కొనసాగుతోంది" అని ఆరోపించారు.

వివరాలు 

తేజస్వి వైపే మొగ్గు.. వ్యూహం ఇదే! 

మరోవైపు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ని ప్రకటించడానికి కూటమి లోని అన్ని పార్టీలు అంగీకరించాయనటుగా ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. "చలో బీహార్, బద్లేం బీహార్" అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కేంద్రం, బీహార్ ప్రభుత్వాలు మహిళలకు రూ. 10,000 నగదు బదిలీ పథకాలు ప్రకటించడంతో, వాటి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ 'కులం కార్డు'ను ప్రయోగించక తప్పలేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎన్నికల ముందు తేజస్విని సీఎం అభ్యర్థిగా బలంగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా యాదవ్ (14%), ముస్లిం (18%) ఓట్లను పూర్తిగా ఏకీకృతం చేయవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ 32% ఓటు శాతం కూటమికి దృఢమైన పునాది వేయగలదని అంచనా.

వివరాలు 

 కొలిక్కిరాని సీట్ల పంపకాలు 

నామినేషన్ల ఉపసంహరణకు నేడే చివరి రోజు అయినప్పటికీ, మహాకూటమిలో దాదాపు డజన్ సీట్లపై ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ సంక్షోభం పరిష్కారానికి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ బుధవారం పాట్నాకు చేరుకున్నారు. ఆయన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్తో సమావేశమయ్యారు. అనంతరం, 243 సీట్లున్న అసెంబ్లీలో 5-10 స్థానాల్లో 'స్నేహపూర్వక పోటీ' ఉండటం పెద్ద సమస్య కాదని గెహ్లాట్ వ్యాఖ్యానించారు.