LOADING...
#NewsBytesExplainer: జూబ్లీహిల్స్‌లో జంబో పోటీ.. ఎవరికీ లాభం? ఎవరికీ నష్టం?
జూబ్లీహిల్స్‌లో జంబో పోటీ.. ఎవరికీ లాభం? ఎవరికీ నష్టం?

#NewsBytesExplainer: జూబ్లీహిల్స్‌లో జంబో పోటీ.. ఎవరికీ లాభం? ఎవరికీ నష్టం?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 31, 2025
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో అభ్యర్థుల రద్దీ జంబో బ్యాలెట్‌ రూపంలో దర్శనమిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున పోటీ పడుతున్న వారి ప్రభావం చివరికి ఎవరిని తాకుతుందన్నదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌. 58 మంది అభ్యర్థులు బరిలో ఉంటే... అందులో 48 మంది నాన్‌ లోకల్సే ఎందుకున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాళ్లందరూ నామినేషన్‌ ఎందుకు వేశారు? అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై పగ తీర్చుకునేందుకు ఈ పోటీనా? ఒకేసారి రెండు పార్టీలకు వ్యతిరేకంగా నిలబడటానికి కారణం ఏమిటి?

వివరాలు 

బరిలో 58 మంది అభ్యర్థులు 

సాధారణంగా ఏ ఎన్నికలోనైనా ప్రధాన పార్టీలతో పాటు కొద్ది మంది స్వతంత్రులు మాత్రమే బరిలో ఉంటారు. కానీ జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక మాత్రం పూర్తిగా భిన్నంగా సాగుతోంది. నామినేషన్ల దాఖలుకు గడువు సాయంత్రం 3 గంటల వరకు ఉండగా, అప్పటికే లైన్లో నిలబడ్డ వారందరి పత్రాలు స్వీకరించడానికే తెల్లవారుజాము అయిపోయింది. సాధారణంగా ఓటేయడానికి కూడా ఆ టైం వరకు క్యూలో ఉండరు. మొత్తం 211 మంది 321 నామినేషన్లు వేశారు. స్క్రూటినీ తర్వాత ఎక్కువ శాతం తిరస్కరించబడినా 81 మంది పోటీలో నిలిచారు. ఆ తర్వాత 23 మంది ఉపసంహరణ చేసుకోవడంతో, చివరికి 58 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు.

వివరాలు 

ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీపై కూడా వ్యతిరేకత

అయినా... ఇది కూడా తక్కువ సంఖ్యేంకాదు. వీరిలో కేవలం 10 మంది మాత్రమే స్థానికులు, మిగతా 48 మందికి నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేదు. దీంతో ప్రజల్లో "ఇంతమంది ఎందుకు నామినేషన్లు వేశారంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతే కారణమా?" అన్న చర్చ మొదలైంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీపై కూడా వ్యతిరేకత ఉన్నవాళ్లు బరిలోకి దిగారు. మాజీ బీఆర్‌ఎస్‌ పాలనలో మిర్‌ఖాన్‌పేట, యాచారం, ముచ్చర్ల, కడ్తాల్ ప్రాంతాల్లో ఫార్మా సిటీ పేరుతో జరిగిన భూ సేకరణకు రైతులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. 2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆ భూములను రైతులకు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్‌పైనా నిరసన వెల్లువెత్తుతోంది.

వివరాలు 

రెండు పార్టీలకు వ్యతిరేకంగా బరిలోకి..

దీంతో ఫార్మా సిటీ భూ బాధితులు జూబ్లీహిల్స్‌ ప్రాంతంతో ఎలాంటి సంబంధం లేకపోయినా,రెండు పార్టీలకు వ్యతిరేకంగా బరిలోకి దిగారు. అదే విధంగా రీజినల్‌ రింగ్‌ రోడ్‌ అలైన్మెంట్‌ మార్పు వల్ల భూములు కోల్పోతున్న రైతులు, ఉద్యోగాల భర్తీ చేయకపోవడంపై నిరుద్యోగ జేఏసీ, ఎస్సీ వర్గీకరణలో నష్టం జరిగిందని భావిస్తున్న మాల సంఘాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వడం లేదని రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘాలు.. వీరందరూ తమ సమస్యలను ప్రదర్శించడానికి జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికను వేదికగా ఉపయోగించుకుంటున్నారు. కానీ ప్రశ్న ఏంటంటే.. నిజంగా వీరు ఓటర్లపై ప్రభావం చూపగలరా? బయట నుంచి వచ్చి నామినేషన్‌ వేసినవారిని స్థానిక ఓటర్లు గౌరవిస్తారా? ఒకరు లేదా ఇద్దరు ప్రభావం చూపినా దాని వల్ల ఎవరికీ నష్టం కలుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.

వివరాలు 

రెండు సంవత్సరాల వ్యవధిలోనే కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత

ఇక ప్రధాన పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. జూబ్లీహిల్స్‌లో వరుసగా మూడు సార్లు గెలిచిన తమ ఎమ్మెల్యే మరణంతో ఉపఎన్నిక అవసరమైన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సీటును కాపాడుకోవడంపై దృష్టి పెట్టింది. మరోవైపు, కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని నిరూపించాలని చూస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ కూడా అధికారంలో ఉన్న ప్రయోజనాన్ని ఉపయోగించి ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉపఎన్నిక పర్యవేక్షణ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించి, ప్రతి డివిజన్‌కి ఇద్దరు మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమించింది. ప్రతి పది పోలింగ్‌ బూత్‌లకు ఒక నేతకు బాధ్యతలు అప్పగించి, అత్యధిక మెజారిటీతో గెలవాలన్నది కాంగ్రెస్‌ వ్యూహం.

వివరాలు 

రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠభరితమైన సమరం

ఇలాంటి గట్టి పోటీలో ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంతమంది స్వతంత్ర అభ్యర్థుల జాబితా చివరికి ఎవరికి ప్రమాదం తెస్తుందో అన్న ఆసక్తి పెరిగింది. మరోవైపు, ఇద్దరు స్వతంత్రులకు బీఆర్‌ఎస్‌ గుర్తు "కారు"కు పోలిక ఉన్న రోడ్‌ రోలర్‌, చపాతీ రోలర్‌ గుర్తులు రావడంతో గులాబీ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే ఈసారి ఈవీఎంలో అభ్యర్థుల ఫోటోలు కూడా చూపించే సదుపాయం ఉండటం కొంత ఊరటనిస్తోంది. ఇలా ఎన్నో ట్విస్టులతో సాగుతున్న జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠభరితమైన సమరంగా మారింది.