రాజకీయాల్లోకి కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి.. బీజేపీలో చేరిక
Judge Abhijit Gangopadhyay Resigns: కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మార్చి 7న బీజేపీలో చేరనున్నారు. రాజీనామా చేసిన అనంతరం కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను బహుశా మార్చి 7న మధ్యాహ్నం బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌పై బీజేపీ మాత్రమే పోరాడగలదని జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ పేర్కొన్నారు. అంతకుముందు, జస్టిస్ గంగోపాధ్యాయ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ శివజ్ఞానంకు పంపారు.
లోక్‌సభ బరిలో జస్టిస్ గంగోపాధ్యాయ
జస్టిస్ గంగోపాధ్యాయ మంగళవారం ఉదయం హైకోర్టులోని తన ఛాంబర్‌కు చేరుకున్నారు. అనంతరం తన రాజీనామా లేఖను పంపారు. మార్చి 5న తాను న్యాయమూర్తి (కలకత్తా హైకోర్టు) పదవికి రాజీనామా చేస్తానని జస్టిస్ గంగోపాధ్యాయ ఆదివారమే ప్రకటించారు. జస్టిస్ గంగోపాధ్యాయ పశ్చిమ బెంగాల్‌లోని తమ్లూక్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు తమ్లుక్ సీటు కంచుకోటగా ఉంది. 2009 నుంచి టీఎంసీ ఈ సీటును గెలుచుకుంటూ వస్తోంది. బెంగాల్‌లో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి 2009- 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందారు. అప్పుడు ఆయన టీఎంసీలో ఉన్నారు.