Manish Sisodiya: సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఈనెల18 వరకు పొడిగింపు
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 18 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆయనతో పాటు ఈ కేసులో అరెస్టైన వ్యక్తులకు కూడా జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. మనీష్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకమైన అక్రమ నగదు లావాదేవీల వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలను దర్యాప్తు సంస్థలకు ఇప్పటికీ అందజేయడంలేదని ఈడీ కోర్టుకు వెల్లడించింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో 2023 ఫిబ్రవరిలో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా...ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఆయనను అరెస్టు చేసి ఈ కేసులో అసలు సూత్రధారిగా పేర్కొంది.
లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలకంగా సిసోడియా!
ఎక్సైజ్ విధానాన్ని రూపొందించడంలో సిసోడియా కీలకంగా వ్యవహరించారని ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. సిసోడియా రూపొందించిన మద్యం విధానం వల్లే ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. సిసోడియా బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి జస్టిస్ కావేరి బవేజా విచారించారు. సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది మోహిత్ మాథూర్ హాజరై వాదనలు వినిపించారు. సిసోడియాను దర్యాప్తు సంస్థలు 11 నెలలకు పైగా విచారించాయని కోర్టుకు తెలిపారు. సిసోడియా నేరానికి పాల్పడ్డారని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలను సేకరించలేకపోయాయని కోర్టు కు చెప్పారు. సిసోడియా రూపొందించిన మద్యం విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు గానీ, వ్యక్తులకు గానీ ఎటువంటి నగదు నష్టం కలగలేదని నివేదించారు.
బెయిల్ ఇవ్వండి: సిసోడియా తరఫు లాయర్
సాక్షులను ప్రభావితం చేయడం గానీ, సాక్ష్యాలను నాశనం చేయడం గానీ తన క్లయింట్ చేయరని ఆయనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. కాగా, వాదనల అనంతరం సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 18 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.