తెలంగాణలో ముగిసిన వేసవి సెలవులు; రేపటి నుంచి ఇంటర్ తరగతులు
తెలంగాణలో జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు బుధవారం(మే 31)తో ముగియనున్నాయి. దీంతో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తరగతులను గురువారం నుంచి నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ షెడ్యూల్‌ను కూడా ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మొదటి దశ అడ్మిషన్లు పూర్తి చేయడానికి జూన్ 30 చివరి తేదీగా నిర్ణయించింది. గడువులోగా రెండవ దశకు షెడ్యూల్ ప్రకటించనుంది. కొత్త అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి 304 రోజుల్లో అన్ని జూనియర్ కాలేజీలకు 227 పని దినాలు ఉంటాయి.
407 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు
407 ప్రభుత్వ జూనియర్ కాలేజీ(జీజేసీ)ల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ పనులను ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 301.24 కోట్ల రూపాయల ప్రతిపాదనను పంపింది. 212ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లతో పాటు ఎనిమిది కొత్త భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపింది. 122 జీజేసీల్లో కాంపౌండ్ వాల్స్ నిర్మించడానికి, 48 జీజేసీల్లో ఫర్నిచర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు బాలికల కోసం ప్రత్యేతంగా రూ.29.99 కోట్ల అంచనా వ్యయంతో 331 మరుగుదొడ్లు నిర్మించడానికి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ ప్రణాళికలు రూపొందించింది.