Justice Fathima Beevi : సుప్రీం తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి కన్నుమూత
భారత సుప్రీంకోర్టు (Supreme Court) ప్రథమ మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవి(96) తుది శ్వాస విడిచారు. కేరళలోని కొల్లాంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. గతంలో బీవి, తమిళనాడు గవర్నర్‌గానూ బాధ్యతలు చేపట్టారు. ఆమె మృతి పట్ల కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ సంతాపం ప్రకటించారు. భారతదేశంలోని అత్యున్నత కోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా బీవి చర్రిత సృష్టించారని ఆయన అన్నారు. 1927, ఏప్రిల్ 30న కేరళలోని పతనంతిట్టలో జస్టిస్ ఫాతిమా బీవి జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతోనే ఆమె న్యాయవాద విద్యను అభ్యసించారు.
తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన బీవి
1950లో కేరళ బార్ కౌన్సిల్ పరీక్షలో ఫాతిమా బీవి బంగారు పతకం (Gold Medal) సాధించారు. ఒక మహిళగా గోల్డ్ మెడల్ గెల్చుకుని ఆమె అప్పట్లోనే రికార్డు నెలకొల్పారు. అనంతరం 1974లో జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టారు. 1980లో ఇన్‌కమ్‌ట్యాక్స్ అప్పీలేట్ ట్రెబ్యునల్ (Income Tax Appellate Tribunal)లో జ్యుడిషియల్ సభ్యురాలిగా నియామకమయ్యారు. 1983 నుంచి 1989 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన బీవి, 1989 అక్టోబరు 6 నుంచి 1992 ఏప్రిల్ 29 వరకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. న్యాయ రంగంలో బీవి సేవలను గుర్తించిన అప్పటి కేంద్రం, 1997లో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఫాతిమా బీవిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారు.