Page Loader
Supreme Court Collegium: కోల్‌కతా హైకోర్టుకు జస్టిస్‌ సుజయ్‌పాల్‌ బదిలీ.. కొలీజియం కీలక సిఫార్సు
కోల్‌కతా హైకోర్టుకు జస్టిస్‌ సుజయ్‌పాల్‌ బదిలీ.. కొలీజియం కీలక సిఫార్సు

Supreme Court Collegium: కోల్‌కతా హైకోర్టుకు జస్టిస్‌ సుజయ్‌పాల్‌ బదిలీ.. కొలీజియం కీలక సిఫార్సు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా తెలంగాణ హైకోర్టుకు సంబంధించి కీలక బదిలీలను సిఫార్సు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్‌పాల్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ సుజయ్‌పాల్ 2024 మార్చి 26న తెలంగాణకు బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి 2025 జనవరి 21న సీజే ఆలోక్ అరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయిన అనంతరం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. ఇకపోతే గతంలో ఇతర హైకోర్టులకు బదిలీ అయిన ముగ్గురు న్యాయమూర్తులను మళ్లీ తెలంగాణ హైకోర్టుకు రప్పించేందుకు కొలీజియం ప్రతిపాదించింది. వీరిలో జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ డాక్టర్ చిల్లకూరు సుమలత ఉన్నారు.

Details

 జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి 

1967 నవంబర్ 7న రంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో జన్మించిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయపట్టా పొందారు. 1990లో బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకుని వివిధ ప్రభుత్వ సంస్థల తరఫున కేసులు వాదించారు. 2019లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, 2023 మే 15న పట్నా హైకోర్టుకు బదిలీ అయ్యారు.

Details

 జస్టిస్ కన్నెగంటి లలిత 

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా జమ్ములపాలెం నివాసితురాలైన లలిత 1994లో న్యాయ వృత్తిలోకి అడుగుపెట్టారు. పలు ప్రభుత్వ సంస్థల స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించిన ఆమె 2020 మే 2న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021లో తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయిన ఆమెను 2023 జులై 28న కర్ణాటక హైకోర్టుకు పంపారు. జస్టిస్ డాక్టర్ చిల్లకూరు సుమలత 1972 ఫిబ్రవరి 5న నెల్లూరులో జన్మించిన ఆమె, 1995లో తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. జిల్లా జడ్జిగా, జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా, సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా పనిచేశారు. 2021అక్టోబరు 14న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను 2023 నవంబరు 23న కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు.

Details

21 మంది న్యాయమూర్తులు బదిలీ

మొత్తంగా దేశవ్యాప్తంగా 10 హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తులను 11 రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు మళ్లీ ముగ్గురు న్యాయమూర్తుల రాకతో న్యాయసేవల్లో మరింత స్థిరత ఏర్పడే అవకాశం ఉంది.