
KCR: బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రాష్ట్ర సమితి (భారాస) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని న్యాయవిచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఆయనతో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రస్తుత భాజపా ఎంపీ ఈటల రాజేందర్‌లకు కూడా ఈ నోటీసులు పంపారు.
వారు 15 రోజుల్లోగా కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన వివిధ బ్యారేజీలపై జరుగుతున్న విచారణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో,హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రిగా,ఈటల ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
అందువల్లనే వారి పాత్రపై వివరాలు తెలుసుకోవడానికి కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
2024 మార్చిలో న్యాయ విచారణ కమిషన్
కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం - కేసీఆర్ జూన్ 5న, హరీశ్‌రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన సమస్య నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టత పొందేందుకు అన్నారం,సుందిళ్ల బ్యారేజీలపై కూడా విచారణ జరపాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఒక న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
ఈ కమిషన్ ఇప్పటివరకు నిర్మాణం, నిర్వహణ, డిజైన్, నాణ్యత నియంత్రణ, చెల్లింపులు, ఖాతాలు, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుండి సమాచారాన్ని సేకరించింది.
వివరాలు
ఈ నెల 21 లేదా 22న తుది నివేదికను ప్రభుత్వానికి
విచారణ పూర్తికాకపోవడంతో ఇప్పటివరకు ప్రభుత్వం ఏడుసార్లు ఈ కమిషన్‌కు గడువు పొడిగించింది.
చివరిసారి గడువును కేవలం ఒక నెలపాటు మాత్రమే పొడిగించారు. ఈ నెలాఖరులోగా కమిషన్ తన పని ముగించాల్సి ఉంది.
జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 21 లేదా 22న తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇక ఇప్పటికే విచారణలో భాగంగా పలువురు సీనియర్ ఇంజినీర్లు, అధికారులు - గత ప్రభుత్వం తీసుకున్న అనేక ముఖ్యమైన నిర్ణయాలు నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగాయని, ఆయనే ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నట్లు సమాచారం.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, కమిషన్ ఆయన్ను, అప్పటి మంత్రులైన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని నిర్ణయించిందని సమాచారం.