Bhupalapalli Murder: కాళేశ్వరం మేడిగడ్డ కేసు న్యాయపోరాటం.. పిటిషనర్ దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
భూపాలపల్లి జిల్లాలో బుధవారం రాత్రి ఘోర హత్య సంభవించింది. మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంపై కోర్టులో కేసు వేసిన వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా హత్య చేశారు.
మృతుడి పై గతంలో భూ వివాదాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.
2023లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశారు.
ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
హత్యకు గురైన రాజలింగమూర్తి (47) భూపాలపల్లికి చెందిన భూ వివాదాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిగా పేరొందారు
Details
ఆస్పత్రికి చేరుకొనేలోపే మృతి
బుధవారం రాత్రి సుమారు ఏడున్నర గంటల సమయంలో గుర్తు తెలియని నలుగురైదుగురు దుండగులు మంకీ క్యాప్‌లు ధరించి రాజలింగమూర్తిని చుట్టుముట్టి కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు.
తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు కత్తిపోట్లతో పేగులు బయటకు వచ్చాయి.
స్థానికులు అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆస్పత్రికి చేరుకునేలోపు మృతి చెందాడు. రాజలింగమూర్తి భార్య గతంలో బీఆర్‌ఎస్ తరపున వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారు.
2019 మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి 15వ వార్డు నుండి పోటీ చేసి గెలిచారు. అయితే కొద్ది నెలలకే ఆమెను బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు.
Details
బాధితుడిపై పలు కేసులు నమోదు
హత్యకు గురైన రాజలింగమూర్తి జంగేడు శివారు పక్కీరుగడ్డలోని ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై, అక్కడి నుండి ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతుండగా దుండగులు అటకాయించారు.
రాజలింగమూర్తి రెండు దశాబ్దాలుగా వరంగల్ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది సహాయంతో భూ వివాదాలను పరిష్కరించేవారు.
ఈ నేపథ్యంలోనే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.
అంతేకాకుండా ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని సింగరేణి సంస్థపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు.
Details
నిందితులను కఠినంగా శిక్షించాలి
హత్య అనంతరం రాజలింగమూర్తి భార్య సరళ, కుటుంబ సభ్యులు భూపాలపల్లిలోని అంబేడ్కర్ కూడలిలో జాతీయ రహదారిపై బైఠాయించి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, మాజీ సర్పంచి బుర్ర చంద్రయ్య, వార్డు మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబులే హత్యకు కారణమని ఆరోపించారు.
వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదే విషయమై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హత్యకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది.