కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు; 'ఎండ్యూరింగ్ సింబల్' అవార్డును ప్రధానం చేసిన ఏఎస్‌సీఈ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం మరో ఖ్యాతిని గడిచింది. 1852లో స్థాపించబడిన అతిపురాతన అమెరికాకు చెందిన పురాతన ఇంజనీరింగ్ సొసైటీ అయిన అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ఏఎస్‌సీఈ) గుర్తింపు లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టును 'ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రోగ్రెస్'గా గుర్తించి అవార్డును ప్రదానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఈ అవార్డును అందుకున్నారు. అమెరికాలోని నెవాడాలోని హెండర్సన్‌లో 'అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్' ఆధ్వర్యంలో నిర్వహించిన 'ప్రపంచ పర్యావరణ, జలవనరుల సదస్సు'లో మంత్రి కేటీఆర్ సోమవారం పాల్గొన్ని మాట్లాడారు.
అతి తక్కువ సమయంలోనే కాళేశ్వరం పూర్తి: కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అవార్డు రావడం రాష్ట్రానికి, సీఎం కేసీఆర్ పనితనానికి అపూర్వమైన గుర్తింపుగా కేటీఆర్ అభివర్ణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని ప్రభుత్వం అతి తక్కువ సమయంలో పూర్తి చేసిందన్నారు. తెలంగాణ రాకముందు సాగునీటి కొరతతో కరువుకు నిలయంగా ఉండేదని కేటీఆర్ అన్నారు. దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్య నుంచి తెలంగాణకు శాశ్వతంగా విముక్తి లభించిందన్నారు.