
Menstrual Leave: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు (Menstrual Leave) కల్పించాలని అంగీకరించారు. ఈ కొత్త నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులతో పాటు వస్త్రపరిశ్రమ, బహుళజాతి సంస్థలు, ఐటీ కంపెనీలు, ఇతర ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈ సెలవు వర్తించనుందని ప్రభుత్వం వెల్లడించింది.
వివరాలు
ఈ నిర్ణయం ఉద్యోగినులకు ఎంతగానో ఉపకరించనుంది
"శ్రామిక మహిళల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని రూపొందించాము. ఇది మహిళల శారీరక, మానసిక శ్రేయస్సును పరిగణలోకి తీసుకుని, నెలసరి ఆరోగ్యంపై అవగాహనను పెంచే ప్రయత్నం. ఉద్యోగులకు ఇది చాలా ఉపయోగకరమని మనం విశ్వసిస్తున్నాం. ఇదే విధంగా ఇతర రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి. కాబట్టి మన రాష్ట్రంలో కూడా మహిళలకు ఈ సెలవును అందించాలన్నది మా నిర్ణయం" అని క్యాబినెట్ సమావేశం అనంతరం న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ వెల్లడించారు.
వివరాలు
వేతనంతో కూడిన సెలవు
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మహిళా హక్కుల కార్యకర్త బృందా అడిగె స్వాగతించారు ఆమె అభిప్రాయానికి అనుగుణంగా, ఇలాంటి నిర్ణయాలు మహిళల సమానహక్కుల సాధనలో, వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అయితే, అసంఘటిత రంగాల్లో పనిచేసే మహిళలకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతానికి, బిహార్,ఒడిశా,కేరళ,సిక్కిం వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నెలసరి సెలవు విధానాన్ని అమలు చేస్తున్నాయి. అలాగే జొమాటో,స్విగ్గీ, ఎల్ అండ్ టీ, గోజూప్ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనంతో కూడిన ఈ సెలవును అందిస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయంతో మహిళా ఉద్యోగుల ఆరోగ్యం, సౌకర్యం, హక్కుల పరిరక్షణలో ముందడుగు వేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.