LOADING...
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు సంకేతాలు.. సీఎం పదవి వదులుకునే దిశగా సిద్ధరామయ్య?
సీఎం పదవి వదులుకునే దిశగా సిద్ధరామయ్య?

Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు సంకేతాలు.. సీఎం పదవి వదులుకునే దిశగా సిద్ధరామయ్య?

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2026
08:00 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గురువారం ముందుగా సహచర మంత్రులకు అల్పాహార విందు ఏర్పాటు చేసి, అనంతరం బెంగళూరులోని లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా పత్రం అందజేయవచ్చని సమాచారం వెలువడుతోంది. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై కొంతకాలంగా కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో మంగళవారం దిల్లీలో కాంగ్రెస్‌ అధిష్ఠానం కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి రణ్‌దీప్‌ సుర్జేవాలాతో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పాల్గొన్నారు.

వివరాలు 

రాజ్యసభ స్థానంతో పాటు సభాపక్ష నేతగానూ అవకాశం

సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని నాయకత్వ మార్పుకు సహకరించాలని పార్టీ అధిష్ఠానం సూచించినట్లు తెలిసింది. ప్రతిఫలంగా ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతో పాటు అక్కడ విపక్షనాయకుడి బాధ్యతలు అప్పగించే అంశాన్ని కూడా పరిశీలించినట్లు సమాచారం. అలాగే ఆయన కుమారుడు యతీంద్రకు ఉపముఖ్యమంత్రిగానూ అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రతిపాదనలను సిద్ధరామయ్య తొలుత సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. తన అనుచరులతో చర్చించిన తర్వాతే తుదినిర్ణయం వెల్లడిస్తానని ఆయన తెలిపినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖర్గే రాజ్యసభ సభ్యత్వ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆ స్థానంలో సిద్ధరామయ్యను పంపాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల సమయానికే కర్ణాటక రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

వివరాలు 

పరమేశ్వర్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు

ఇక తన రాజీనామా తర్వాత కూడా ముఖ్యమంత్రి పదవి అహింద వర్గాలకు చెందిన నాయకుడికే ఇవ్వాలని సిద్ధరామయ్య అధిష్ఠానానికి సూచించినట్లు సమాచారం. తనకు వంద మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని,శాసనసభాపక్ష సమావేశంలో ఓటింగ్‌ ద్వారానే ముఖ్యమంత్రిగా ఎంపికయ్యానని ఆయన గుర్తు చేసినట్లు తెలుస్తోంది. అహింద వర్గాలకు అవకాశం కల్పిస్తే తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం. అధిష్ఠానం ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే దళిత నేత,రాష్ట్ర హోంమంత్రి డాక్టర్‌ జి. పరమేశ్వర్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మాత్రం 2023లో పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత అధికార భాగస్వామ్యంలో భాగంగా తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అగ్రనేతల ముందు పట్టుదలగా చెప్పినట్లు తెలిసింది.

Advertisement

వివరాలు 

ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న వార్తల్లో నిజం లేదు: కేసీ వేణుగోపాల్

ఈ సమావేశాల అనంతరం కేసీ వేణుగోపాల్‌ మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ, శాసన మండలి ఎన్నికల అంశాలపైనే చర్చ జరిగిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశాలు సమావేశంలో చర్చకు రాలేదని స్పష్టం చేశారు.

Advertisement