Karnataka DGP: బాధ్యత మరిచిన డీజీపీ.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్.. డీజీపీపై వేటు
ఈ వార్తాకథనం ఏంటి
భాద్యతాయుతమైన హోదాలో ఉండి, అదే భాద్యతను మరిచేలా డీజీపీ స్థాయి అధికారి వ్యవహరించిన ఘటన తీవ్ర దుమారం రేపింది. కార్యాలయంలోనే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కర్ణాటక డీజీపీ కె. రామచంద్రరావు మహిళలతో అనుచితంగా ప్రవర్తించినట్లు కనిపించే వరుస వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయ, పరిపాలనా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
వివరాలు
వైరల్ అవుతున్న వీడియోలు నకిలీవి: రామచంద్రరావు
ఈ ఆరోపణలపై రామచంద్రరావు స్పందిస్తూ, తనపై వచ్చిన అభియోగాలను పూర్తిగా ఖండించారు. తనను కావాలనే ఇరికించారని, వైరల్ అవుతున్న వీడియోలు నకిలీవని స్పష్టం చేశారు. వీడియో కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం ఆయన కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వరను కలిసేందుకు వెళ్లారు. అయితే, ఇద్దరి మధ్య భేటీ జరగలేదు. అనంతరం హోంమంత్రి నివాసం బయట మీడియాతో మాట్లాడిన రామచంద్రరావు, "ఇది పూర్తిగా కల్పితం. వీడియో అంతా ఫేక్" అంటూ వ్యాఖ్యానించారు.
వివరాలు
మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో లీక్
కె. రామచంద్రరావు రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారిగా, పౌర హక్కుల అమలు డైరెక్టరేట్ (DCRE) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన కార్యాలయంలో ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆ వీడియోల్లో, డీజీపీ రామచంద్రరావు తన ఆఫీసులో మహిళతో అనుచిత ప్రవర్తనలో పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది. ఒక వీడియోలో ఆయన యూనిఫాంలో తన కుర్చీలో కూర్చుని ఉండగా, మహిళతో సరిహద్దులు దాటిన ప్రవర్తన చేసినట్లు దృశ్యాలు ఉన్నాయి. మరో వీడియోలో ఆయన సూట్ ధరించి ఉండగా, గదిలో భారత జెండా,త్రివర్ణ పతాకం, పోలీస్ శాఖ చిహ్నం స్పష్టంగా దర్శనమిస్తాయి. లభ్యమైన సమాచారం ప్రకారం,ఈ వీడియోలు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినవిగా భావిస్తున్నారు.
వివరాలు
రామచంద్రరావు వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు
ఇవి దాదాపు ఏడాది క్రితం నాటివని తెలుస్తోంది. ప్రముఖ నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టుకు ముందు కాలానికి చెందినవని అంచనా. అయితే, ఇంతకాలం తర్వాత ఈ వీడియోలు ఒక్కసారిగా బయటకు రావడానికి గల కారణాలు ఇంకా స్పష్టతకు రాలేదు. రామచంద్రరావు వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదని తెలుస్తోంది. మార్చి 2025లో బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టై ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న రన్యా రావుకు ఆయన సవతి తండ్రి. తన తండ్రి హోదాను ఉపయోగించుకుని ప్రోటోకాల్‌ను దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు రన్యాపై ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంతో తాజా వీడియో వ్యవహారం మరింత సంచలనం సృష్టిస్తోంది.