Karnataka: కర్ణాటకలో పానీపూరి ప్రియులకు షాక్.. పానీపూరీ శాంపిల్స్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనం
కర్ణాటక ఆహార భద్రతా విభాగం పానీపూరీ శాంపిల్స్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాన్ని కనుగొంది. ఆ రాష్ట్రంలో ఆహార ప్రియులకు సంబంధించిన ఒక సర్వేలో భయంకరమైన నిజాలు వెల్లడయ్యాయి. వాటి వివరాలు ఇలా వున్నాయి. ఆహార భద్రత అధికారుల ఇటీవల జరిపిన పరీక్షల్లో వీధి ఆహారం,పానీపూరీ గురించి దిగ్భ్రాంతకరమైన విషయాలు వెల్లడయ్యాయి. రోడ్‌సైడ్ స్టాల్స్ , రెస్టారెంట్‌లు భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమయ్యాయి. 260 నమూనాలలో, 22 శాతం భద్రతా ప్రమాణాలను పాటించడంలో ఘోరంగా వైఫల్యం చెందాయి. 41 శాంపిల్స్‌లో కృత్రిమ రంగులు ,క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్‌తో సహా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగి ఉన్న పదార్థాలు ఉన్నాయని అధికారులు కనుగొన్నారు.
18 నమూనాలు మానవ వినియోగానికి అనర్హమైనవి
అదనంగా 18 నమూనాలు పాతవి లేదా కలుషితమైనవి కావడం వల్ల మానవ వినియోగానికి అనర్హమైనవిగా పరిగణించారు. ఈ సందర్భంగా ఆహార భద్రత కమిషనర్ శ్రీనివాస్ కె మాట్లాడుతూ.. "రాష్ట్రవ్యాప్తంగా అందిస్తున్న పానీ పూరీ నాణ్యతపై మాకు చాలా ఫిర్యాదులు అందాయి.మా తనిఖీల్లో రోడ్డు పక్కన వ్యాపారుల నుంచి ఉన్నత స్థాయి సంస్థల వరకు విస్తృతంగా సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు".
పానీపూరీ తింటే పై ప్రాణాలు పైపైకే
హిందుస్ధాన్ టైమ్స్ నివేదిక ప్రకారం,నమూనాలలో గుర్తించిన ప్రకాశవంతమైన నీలం,సింధటిక్ పదార్ధాలతో కూడిన పసుపు బాగా ప్రమాదకరమైనవి. వీటిని తింటే సమస్యలను కోరి తెచ్చుకోవడమేనని నిపుణులు చెప్పారు.అంతే కాకుండా యాసిడ్ తో కూడిన వంటి రసాయనాలు పానీ పూరీలో వాడటం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం వుంది. గోబీ మంచూరియన్,కాటన్ మిఠాయి వంటి వంటలలో రోడమైన్-బి వాడకాన్ని కర్ణాటక ప్రభుత్వం గతంలో నిషేధించించింది. దీనిపై ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ"ఆహార భద్రత మా మొదటి ప్రాధాన్యత అన్నారు.హానికరమైన మిశ్రమాలను,సంకలనాలను గుర్తించడానికి తనిఖీలను కొనసాగిస్తామన్నారు. ఇందుకు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలకు చేయడానికి వెనకాడబోమని తేల్చి చెప్పారు. తమిళనాడులో సైతం ఇదే విధమైన కఠిన చర్యలను ఈ ఏడాది నుంచే ప్రారంభించింది.
ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు హెచ్చరిక
ఆహార భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు పెరుగుతున్నందున, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఉల్లంఘించిన వారిపై కఠినంగా చట్టాలను అమలు చేస్తామని ఆరోగ్య మంత్రి హామీనిచ్చారు. వారు తినే ఆహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు వినియోగదారులను కోరారు.