LOADING...
Governor Grandson Harassment: వరకట్న ఆరోపణలు చేసిన గవర్నర్ మనవడి భార్య .. పోలీసులకు ఫిర్యాదు 
పోలీసులకు ఫిర్యాదు

Governor Grandson Harassment: వరకట్న ఆరోపణలు చేసిన గవర్నర్ మనవడి భార్య .. పోలీసులకు ఫిర్యాదు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ మనవడు దేవేంద్ర గెహ్లాట్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. అతడి భార్య దివ్య గెహ్లాట్ తన భర్తతో పాటు అత్తమామలపై వరకట్న వేధింపుల ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. 2018 ఏప్రిల్ 29న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలోట్‌లో 'ముఖ్యమంత్రి కన్యాదాన యోజన' పథకం కింద దేవేంద్ర గెహ్లాట్-దివ్య గెహ్లాట్ వివాహం జరిగింది. ఈ వేడుకకు అప్పటి కేంద్ర మంత్రి, మాజీ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రస్తుతం కర్ణాటక గవర్నర్‌గా ఉన్న థావర్‌చంద్ గెహ్లాట్ సహా పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. దేవేంద్ర గెహ్లాట్ గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ మనవడు కావడం విశేషం.

వివరాలు 

రూ.50 లక్షలు అదనపు కట్నం

ఇక వివాహం తరువాత అత్తారింట్లో అడుగుపెట్టిన దివ్యకు కష్టకాలం మొదలైందని ఆమె ఆరోపించింది. అదనపు వరకట్నం కోసం భర్తతో పాటు ఇంటి సభ్యులు నిత్యం వేధించేవారని పేర్కొంది. అంతేకాకుండా భర్త దేవేంద్ర మద్యం, మాదకద్రవ్యాలకు బానిసై, ఇతర మహిళలతో అనైతిక సంబంధాలు కొనసాగిస్తున్నాడని తెలిపింది. వీటితో తన జీవితం నరకప్రాయంగా మారిందని దివ్య వాపోయింది. దీంతో దివ్యకు కష్టాలు మొదలయ్యాయి. ఆనాటి నుంచి అదనంగా రూ.50లక్షలు కట్నం తీసుకురావాలంటూ వేధింపులు మొదలయ్యాయి.

వివరాలు 

దివ్య ఫిర్యాదు.. 

ఈ వ్యవహారం రత్లాం జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ వద్దకు చేరింది. దివ్య తన నాలుగేళ్ల కుమార్తెను ఉజ్జయిని జిల్లా నాగ్డాలో బలవంతంగా నిలిపి ఉంచారని, వరకట్న వేధింపులు కొనసాగుతున్నాయని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తనకు వెంటనే రక్షణ కల్పించాలని అధికారులను కోరింది. తన భర్త కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులే కాకుండా హత్యాయత్నం, గృహహింస, మైనర్ కుమార్తె అపహరణ వంటి తీవ్రమైన అభియోగాలు మోపింది. 2021లో తాను గర్భవతిగా ఉన్న సమయంలోనూ వేధింపులు మరింత తీవ్రమయ్యాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సరిగా భోజనం కూడా పెట్టేవారు కాదని, శారీరకంగా కొట్టడం, మానసికంగా వేధించడం చేసేవారని ఆరోపించింది.

Advertisement

వివరాలు 

ఇంటి పైకప్పు నుంచి తోసివేశాడని దివ్య ఫిర్యాదు 

కుమార్తె పుట్టిన తర్వాత కూడా బాధలు తగ్గలేదని తెలిపింది. 2019లో కుటుంబ సభ్యుల మధ్య రాజీ ప్రయత్నాలు జరిగినప్పటికీ ఎలాంటి మార్పు రాకుండా పరిస్థితి మరింత దిగజారిందని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 26న భర్త మద్యం సేవించి ఇంటికి వచ్చి తీవ్రమైన దాడికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో వివరించింది. డబ్బు తీసుకొస్తేనే బతకనిస్తానని బెదిరించి, ఇంటి పైకప్పు నుంచి తోసివేశాడని పేర్కొంది. గ్యాలరీలో పడిపోవడంతో తన వెన్నెముక, భుజం, నడుముకు తీవ్రగాయాలు అయ్యాయని, అయినా ఆ రాత్రంతా చికిత్స అందించలేదని ఆరోపించింది. మరుసటి రోజు ఉదయం తనను నాగ్డాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని, అక్కడ వైద్యులు పరిస్థితి ఆందోళనకరమని నిర్ధారించి ఇండోర్‌లోని బాంబే ఆస్పత్రికి రిఫర్ చేశారని దివ్య తెలిపింది.

Advertisement

వివరాలు 

డబ్బు తీసుకొస్తేనే బిడ్డను కలవనిస్తా..

ఈ ఘటనపై తన తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, వైద్య ఖర్చుల కోసం మాత్రం తన తండ్రిపై ఒత్తిడి తెచ్చారని పేర్కొంది. అలాగే తన నాలుగేళ్ల కుమార్తెను అత్తమామలు బలవంతంగా తమ వద్దే ఉంచుకుని, కనీసం బిడ్డను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నవంబర్‌లో పాఠశాలకు వెళ్లిన సమయంలో భర్త అడ్డుకుని డబ్బు తీసుకొస్తేనే బిడ్డను కలవనిస్తానని హెచ్చరించాడని ఆమె తెలిపింది. దివ్య ఫిర్యాదు మేరకు భర్త దేవేంద్ర గెహ్లాట్ (33), మామ జితేంద్ర గెహ్లాట్ (55) అలోట్ మాజీ ఎమ్మెల్యే, బావమరిది విశాల్ గెహ్లాట్ (25), అమ్మమ్మ అనితా గెహ్లాట్ (60) కలిసి రూ.50 లక్షల వరకట్నం కోసం ఎన్నేళ్లుగా వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది.

వివరాలు 

అన్ని వాస్తవాలను మీడియా ముందు పెడతాను

ఈ ఆరోపణలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గెహ్లాట్, "ఆరోపణలు చేయడానికి ఎవరికైనా వీలు ఉంటుంది. అసలు నిజాలు అన్ని మీడియా ముందు వెల్లడిస్తాను," అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దివ్య తల్లిదండ్రుల వద్ద రత్లాంలో నివాసం ఉంటోంది.

Advertisement