Karnataka : కర్ణాటకలో ఘోరం.. హత్యకు గురైన అధికారిణి.. దిగ్భ్రాంతిలో సహోద్యోగులు
కర్ణాటకలోని ప్రభుత్వ మైనింగ్ అధికారణి ప్రతిమ దారుణ హత్యకు గురయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది. అక్రమ మైనింగ్ విషయంలో సదరు అధికారిణి మైనింగ్ మాఫియాను అడ్డుకుంటోందన్న కోపంతోనే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు ఆమెను అతి కిరాతకంగా చంపేశారు. హత్యకు గురైన ఆఫీసర్ వయసు 37 సంవత్సరాలు కాగా, కర్ణాటకలోని మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. బెంగళూరులోని సుబ్రహ్మణ్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న డొక్కలసంద్రలో గోకుల అపార్ట్‌మెంట్‌లో గత 8 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు.
ఎప్పట్లాగే శనివారం కూడా ఇంటికి చేరుకున్నారు, కానీ..
హత్య ఆదివారం నాడు రాత్రి 8:30 గంటల సమయంలో ప్రతిమ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో భర్త, కుమారుడు తీర్థహళ్లిలో ఉన్నారు. అయితే ఎప్పట్లాగే శనివారం కూడా తన విధులు ముగించుకుని, రాత్రి 8 గంటలకు నివాసానికి చేరుకున్నారు అధికారిణి. ఈ క్రమంలోనే డ్రైవర్ ఆమెను ఇంటి వద్ద దిగబెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాసేపటికే దుండగులు ఇంట్లోకి చొరబడి, ప్రతిమను ఘోరంగా హత్య చేశారు.అయితే ప్రతిమ సోదరుడు ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదు. దీంతో భయాందోళనకు గురై ఆదివారం ఉదయమే ప్రతిమ నివాసానికి చేరుకుని చూడగా రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు.ఈ క్రమంలోనే ఆగమేఘాల మీద పోలీసులకు సమాచారం అందించాడు.
కఠినంగా శిక్షిస్తామన్న సీఎం సిద్ధరామయ్య
పక్కా ప్యూహంతో ప్రతిమను హత్య చేశారని పోలీసులు అంచనాకు వచ్చారు. ఫోరెన్సిక్, సాంకేతిక బృందాలు ఘటనా స్థలిలో ఆధారాలు సేకరిస్తున్నాయని పోలీసు అధికారి రాహుల్ కుమార్ షహపూర్వాడ్ తెలిపారు. విచారణ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ఘటనపై స్పందించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హత్యకు గల కారణాలు పూర్తిగా తెలియరాలేదని, కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. దోషులను తప్పకుండా కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిమ చాలా డైనమిక్ అని, ధైర్యవంతురాలని సీనియర్ అధికారి దినేష్ చెప్పారు. విధుల్లో ఆకస్మికంగా తనిఖీలు చేయడం, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడంలో ఆమెకు సాటిలేరన్నారు.కష్టపడి పని చేస్తూ డిపార్ట్‌మెంట్‌లో మంచి పేరు తెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు.