Karnataka: 100శాతం నేనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని; డీకేతో ఇబ్బంది లేదు: సిద్ధరామయ్య కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో సీఎం కుర్చి కోసం పోటీ మొదలైంది. కర్ణాటక కాంగ్రెస్‌లో చాలా మందే సీనియర్ నాయకులు సీఎం అభ్యర్థిగా తామంటే తాము అని ఊహించుకుంటున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ మధ్య నెలకొంది.
మరో నెల రోజుల్లో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మాజీ సీఎం సిద్ధరామయ్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి పదవి రేసులో తాను 100శాతం ఉన్నానని, సిద్ధరామయ్య గురువారం ప్రకటించారు.
డీకే శివకుమార్ కూడా సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారని, అయినా అతనితో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
కాంగ్రెస్
కోలార్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధరామయ్య ఆసక్తి
ఈ సారి సిద్ధరామయ్యను మైసూరులోని వరుణ స్థానం నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. అయితే ఆయన మాత్రం కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. బుధవారం అదే అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు.
డీకే శివకుమార్‌తో ఉన్న సంబంధాల గురించి సిద్ధరామయ్యను అడగ్గా, కాంగ్రెస్ పూర్తిగా ఐక్యంగా ఉందని, ఆయన కూడా ఆశావహుల్లో ఒకరని, అంతిమంగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లోనే ఒకరు శాసన సభకు నాయకుడు అవుతారని సిద్ధరామయ్య అన్నారు.
సిద్ధరామయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందా? అన్నప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ సీఎం అభ్యర్థి పేరును ముందే ప్రకటించదని, ఎన్నికైన ఎమ్మెల్యేలు, హైకమాండ్ నిర్ణయానికే వదిలేస్తామని చెప్పారు.