నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. దిల్లీలోని ప్లీనరీ హాల్ విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 75, జేడీ(ఎస్)కి 28 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.
రెండు ప్రాంతాల్లోనే 101 అసెంబ్లీ స్థానాలు
మార్చి 25న కాంగ్రెస్ 124 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ నుంచి, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కర్ణాటకలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న 80మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ మార్చి 20న విడుదల చేసింది. కర్ణాటకలో బెంగళూరు, సెంట్రల్, కోస్టల్, హైదరాబాద్-కర్ణాటక, ముంబై-కర్ణాటక, దక్షిణ కర్ణాటక - ఆరు వేర్వేరు ప్రాంతాలలో 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ముంబై-కర్ణాటక, దక్షిణ కర్ణాటక రాష్ట్రంలోని అతిపెద్ద ప్రాంతాలు కాగా.. ఈ రెండు ప్రాంతాల్లోనే 101 అసెంబ్లీ స్థానాలు ఉండటం గమనార్హం.