Page Loader
ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత 
కర్ణాటక: ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప

ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత 

వ్రాసిన వారు Stalin
Apr 11, 2023
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూడు వారాల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. గత 40ఏళ్లలో పార్టీ తనకు చాలా బాధ్యతలు అప్పగించిందని నడ్డాకు రాసిన లేఖలో కేఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. తాను బూత్ ఇన్‌చార్జి నుంచి రాష్ట్ర పార్టీ చీఫ్‌వరకు పనిచేసినట్లు గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా తనకు దక్కిందన్నారు ఈశ్వరప్ప. అయితే ఈ ఎన్నికల్లో తనకు టికెట్ రాదని తెలిసే, ముందస్తు జాగ్రత్తగా కేఎస్ ఈశ్వరప్ప రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కర్ణాటక

వివాదాలకు కేంద్రంగా ఈశ్వరప్ప

ఈశ్వరప్పకు ఈ జూన్‌లో 75 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలో బీజేపీలో 75ఏళ్లు దాటిన వారు ఎన్నికలలో పోటీ చేయడానికి, పదవులు చేపట్టకూడదనే నిబంధన ఉంది. ఈ నిబంధన అరుదైన సందర్భాల్లో తప్పితే, అందరికీ వర్తిస్తుందని గతంలోనే పార్టీ పేర్కొంది. ఈ నిబంధన ప్రకారం ఈశ్వరప్పకు ఈ ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశాలు చాలా తక్కువ. అలాగే రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న ఈశ్వరప్పకు తరచుగా వివాదాలకు కేంద్రంగా ఉంటారు. గత నెలలో మసీదులో రంజాన్ ప్రార్థనలు జరుగుతున్న క్రమంలో ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైక్‌లో అరుస్తే మాత్రమే అల్లా ప్రార్థనలు వింటారా? అల్లా చెవిటివాడా? అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.