Page Loader
Karnataka: దేశంలో తొలి ప్రైవేట్‌ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో..
దేశంలో తొలి ప్రైవేట్‌ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో..

Karnataka: దేశంలో తొలి ప్రైవేట్‌ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో..

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. యూరప్‌కు చెందిన ప్రముఖ వైమానిక సంస్థ ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌ లిమిటెడ్ (TASL) కలిసి సంయుక్తంగా కర్ణాటకలోని కోలార్ జిల్లాలో హెచ్‌125 మోడల్ తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రారంభ దశలో 10 హెలికాప్టర్లను నిర్మించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఆ తరువాత వచ్చే 20 సంవత్సరాలలో ఈ గణాంకాన్ని 500 యూనిట్లకు విస్తరించాలనే ప్రణాళిక ఉంది. ఈ తయారీ కేంద్రాన్ని కోలార్ జిల్లాలోని వేమగల్ పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ తయారీ ప్రక్రియలో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతను వినియోగించనున్నారు.

వివరాలు 

హెచ్‌125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని కలిగి ఉన్న నాలుగో దేశంగా గుర్తింపు

ఈ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే హెచ్‌125 హెలికాప్టర్లు దేశీయ అవసరాలు, భారత సాయుధ దళాల అవసరాల కోసం ఉపయోగించబడతాయి. అలాగే విదేశీ మార్కెట్‌కి కూడా ఎగుమతి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్‌ల తర్వాత భారత్‌ హెచ్‌125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని కలిగి ఉన్న నాలుగో దేశంగా గుర్తింపు పొందనుంది. తయారీ, నిర్వహణ, మరమ్మతులు, ఒప్పంద కార్యక్రమాల (MRO - మెంటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్) కోసం మొత్తం 7.40 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్ట్ వేగంగా పూర్తి కావడానికి అవసరమైన అనుమతులను మంజూరు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ విండోను ఏర్పాటుచేసిందని భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది.