 
                                                                                Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. బాధితులను కలిసి కన్నీరు తుడిచిన విజయ్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు కరూర్‌లో జరిగిన దుర్ఘటనపై నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ మళ్లీ స్పందించారు. సోమవారం ఆయన కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను స్వయంగా పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు విజయ్ మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌కు వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారితో ఆత్మీయంగా మాట్లాడి వారి బాధను పంచుకున్నారు. వారిని కలిసేందుకు టీవీకే పార్టీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రిసార్ట్‌లో దాదాపు 50 గదులు బుక్ చేయగా, బాధిత కుటుంబాలు పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా అక్కడికి చేరుకున్నాయి. గత నెల సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రజా సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
Details
మృతుల కుటుంబాలకు రూ.20లక్షల సాయం
60 మందికి పైగా గాయపడ్డారు. ఆ విషాదం తమిళనాడంతటా కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా సాయం ప్రకటించి విజయ్ ఆ మొత్తాన్ని అందజేశారు. ఇక ఘటన దర్యాప్తు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ ఈ కేసును అధికారికంగా స్వాధీనం చేసుకుంది. రాష్ట్ర పోలీసుల నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తిరిగి నమోదు (రీ-రిజిస్టర్) చేస్తూ, సంబంధిత సమాచారం స్థానిక కోర్టుకు పంపింది. కేసులో టీవీకే జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నిర్మల్ కుమార్ తదితరుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు తెలుస్తోంది.