Page Loader
Karnataka: కర్ణాటక మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌.. కాశ్మీరీ విద్యార్థిని కొట్టిన సీనియర్లు
కర్ణాటక మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌..

Karnataka: కర్ణాటక మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌.. కాశ్మీరీ విద్యార్థిని కొట్టిన సీనియర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2025
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరో మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఒక జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేశారు. అతడిని హింసించడమే కాకుండా బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. స్థానికులమనే ప్రాతిపదికన అతని భవిష్యత్తును భయానకంగా మార్చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడి అల్ అమీన్ మెడికల్ కాలేజీలో జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చెందిన హమీమ్ అనే విద్యార్థి ఎంబీబీఎస్ రెండో సంవత్సరంలో చదువుతున్నాడు. ఫిబ్రవరి 18న సాయంత్రం, కాలేజీ ఆవరణలో 2019, 2022 బ్యాచ్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది.

వివరాలు 

కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నం 

హమీమ్ క్రికెట్ ప్లేయర్ కావడంతో, ఆ మ్యాచ్‌ను చూడటానికి వెళ్లాడు. అయితే, ఒక సీనియర్ స్టూడెంట్ అతడిని బౌండరీ లైన్ బయట ఉండాలని ఆదేశించాడు. ఆ మేరకు వెళ్లినప్పటికీ కొందరు సీనియర్లు అతడిని అడ్డుకున్నారు. సీనియర్ల క్రికెట్ మ్యాచ్‌ను ఎందుకు చూస్తున్నావని నిలదీశారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. హమీమ్ నిరాకరించడంతో, అతనిపై ర్యాగింగ్‌కు దిగారు. పాటలు పాడాలని, డ్యాన్స్ చేయాలని బలవంతం చేశారు. అంతేకాకుండా, అతడిని ఒక కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు.

వివరాలు 

బాధ్యులపై కఠిన చర్యలకి డిమాండ్ చేసిన జమ్మూ కశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ కన్వీనర్

హమీమ్ ఈ ర్యాగింగ్‌ను వీడియోలో రికార్డ్ చేయాలని ప్రయత్నించాడు.ఇది గమనించిన సీనియర్లు మరింత దాడి చేశారు. అదే రాత్రి, సుమారు ఎనిమిది మంది సీనియర్లు అతని హాస్టల్ గదికి వెళ్లి దారుణంగా కొట్టారు. బలవంతంగా క్షమాపణలు చెప్పించడంతోపాటు,"ఇక్కడ నువ్వు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉండాల్సి ఉంది.మేం స్థానికులం.నీ జీవితాన్ని భయంకరంగా మార్చగలం" అంటూ హెచ్చరించారు. ఇకపై కాలేజీలో క్రికెట్ ఆడకూడదని కఠినంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ కన్వీనర్ నాసిర్ ఖుయేహామి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిలో జోక్యం చేసుకుని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు అవసరమని డిమాండ్ చేశారు.