KCR: కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదు: నల్గొండ సభలో కేసీఆర్
KCR Speech in Nalgonda: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ ఆధినేత కేసీఆర్ తొలిసారి బహిరంగ సభలో ప్రసంగించారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నట్లు ప్రజలనుద్దేశించిన కేసీఆర్ పేర్కొన్నారు. నీళ్లు లేకపోతే తెలంగాణ బతుకు లేదన్నారు. ఫ్లోరైడ్ సమస్యను బీఆర్‌ఎస్ ప్రభుత్వమే శాశ్వతంగా పరిష్కరించినట్లు గుర్తు చేసారు. ఉద్యమించకపోతే రాష్ట్ర ప్రజలను రక్షించేందుకు ఎవరూ కూడా రారన్నారు. కరెంట్ అంశంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో నిమిషం కూడా పోకుండా కరెంట్‌ను సరఫరా చేసినట్లు చెప్పారు. ఇప్పుడు కరెంటు ఎక్కడికిపోయిందని ప్రశ్నించారు.
మేడిగడ్డకు పోయి ఏం పీకుతారు: కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు మేడిగడ్డకు పోయి ఏం పీకుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయాలన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోతే వాటిని బాగు చేయించి రైతులు నీళ్లు ఇవ్వాలన్నారు. ప్రాజెక్టుల పిల్ల్లర్లు కుంగిపోవడం కొత్తకాదన్నారు. ఇదివరకు నాగార్జున సాగర్, కడెం ప్రాజెక్టు కుంగలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు రైతులను ఎండబెడతారా? అని అడిగారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా వచ్చే వరకు పోరాటం ఆగదన్నారు. ట్రిబ్యునల్‌లో తెలంగాణ వాటా తేలేవరకూ కొట్లాడాలన్నారు.