ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన మోదీ ప్రభుత్వంపై కేరళ సీఎం ఫైర్
హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని నిలిపివేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ దురాక్రణకు వ్యతిరేకంగా కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం అగ్రనేతలు ఆదివారం దిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాలస్తీనా ప్రజలపై అమానవీయ మారణహోమాన్నిఖండిస్తూ ఈ ర్యాలీని నిర్వహించినట్లు విజయన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన మోదీ ప్రభుత్వాన్ని కూడా విజయన్ తప్పుబట్టారు. గాజాలో కాల్పుల విరమణ తీర్మానంకు భారత్ దూరంగా ఉండటం, ఇజ్రాయెల్, అమెరికాకు మద్దతుగా నిలవడం దిగ్భ్రాంతికరం అన్నారు.
గాజాపై దాడి అమానవీయం: ఏచూరి
హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలో ప్రాణనష్టం జరిగిన విషయాన్ని సీపీఐ(ఎం) సెక్రటరీ జనరల్ సీతారాం ఏచూరి ర్యాలీలో ప్రస్తావించారు. ఇప్పటి వరకు గాజాలో 8వేల మందికి పైగా చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయని ఏచూరి అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడి అమానవీయం అని, అనాగరికమన్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, కేరళలో ఇస్లామిస్ట్ గ్రూపు చేసిన నిరసన కార్యక్రమంలో హమాస్ నాయకుడు ఖలీద్ మషాల్ పాల్గొన్నారని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కె.సురేంద్రన్ ఆరోపించిన మరుసటి రోజు తర్వాత.. సీపీఎం ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది.