IRCTC: రూ.1 తక్కువగా రీఫండ్ చేసిన ఐఆర్‌సీటీసీ.. వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు.. ప్రయాణికుడికి రూ.3,100 పరిహారం
ఈ వార్తాకథనం ఏంటి
రైలు టికెట్ రద్దు చేసుకున్నప్పుడు తిరిగి చెల్లించాల్సిన మొత్తంలో ఒక్క రూపాయి తక్కువగా ఇచ్చినందుకు ఐఆర్‌సీటీసీకి వినియోగదారుల కోర్టు షాక్ ఇచ్చింది. కేవలం రూపాయి కోసమే కేరళకు చెందిన ఓ ప్రయాణికుడు కోర్టును ఆశ్రయించగా.. చివరకు అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. టికెట్ రద్దు సమయంలో తక్కువగా చెల్లించిన రూ.1ను వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని, అదనంగా రూ.100 పరిహారం, కేసు ఖర్చుల కింద రూ.3,000 చెల్లించాలని కాసర్‌గోడ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఐఆర్‌సీటీసీని ఆదేశించింది.
వివరాలు
ఇది అన్యాయమైన వ్యాపార విధానం
కమిషన్ అధ్యక్షుడు కృష్ణన్ కె, సభ్యురాలు బీనా కేజీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రయాణికుడికి చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోవడం సేవల్లో లోపం కిందకు వస్తుందని వారు పేర్కొన్నారు.
అంతేకాదు, ఇది అన్యాయమైన వ్యాపార విధానమని అభిప్రాయపడ్డారు.
టికెట్ రద్దు చేసిన 2024 ఆగస్టు 17వ తేదీ నుంచి మొత్తం చెల్లించే వరకు 9 శాతం వడ్డీతో రూ.1 తిరిగి ఇవ్వాలని ఆదేశించారు.
ఈ ఉత్తర్వులు అందిన 30 రోజుల్లోగా పరిహారం, కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని స్పష్టం చేశారు.
వివరాలు
అసలు ఏం జరిగింది?
కేరళకు చెందిన ఫిర్యాదుదారుడు 2024 ఆగస్టు 11న ఆగస్టు 20వ తేదీన ప్రయాణించేందుకు ఏసీ త్రీ టైర్ టికెట్ బుక్ చేసుకున్నాడు.
ఇందుకోసం రూ.553 చెల్లించాడు. అయితే ప్రయాణానికి 48గంటల కంటే ముందుగానే.. అంటే ఆగస్టు 17న టికెట్ రద్దు చేసుకున్నాడు.
టికెట్ రద్దు సమయంలో ఐఆర్‌సీటీసీ రూ.180క్యాన్సిలేషన్ ఛార్జీల కింద,దానిపై 5శాతం జీఎస్టీగా రూ.9 మినహాయించింది.
ఈ లెక్కన ప్రయాణికుడికి రూ.341తిరిగి చెల్లించాల్సి ఉంది. కానీ ఐఆర్‌సీటీసీ మాత్రం రూ.340మాత్రమే చెల్లించింది.
దీంతో అతడికి రావాల్సిన మొత్తంలో ఒక్క రూపాయి తగ్గింది. ఈ విషయంపై ప్రయాణికుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.
ఒక్క రూపాయి తక్కువగా చెల్లించడం వల్ల తనకు గందరగోళం,మానసిక ఆందోళన కలిగాయని, సంస్థపై తనకున్న నమ్మకం దెబ్బతిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
వివరాలు
ఐఆర్‌సీటీసీ వాదనను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?
తనకు జరిగిన ఇబ్బందికి పరిహారంగా రూ.1 లక్ష, నమ్మకద్రోహం చేసినందుకు మరో రూ.1 లక్ష చెల్లించాలని కోరాడు.
అలాగే కేసు ఖర్చుల కింద రూ.5,000, బకాయిగా ఉన్న రూపాయిని కూడా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఈ కేసులో ఐఆర్‌సీటీసీ తన వాదనలను కమిషన్ ముందు ఉంచింది.
అయితే నిర్ణీత గడువు ముగిసిన తర్వాత దాఖలు చేసినందున సంస్థ వాదనలను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదు.
అంతేకాకుండా ప్రయాణికుడికి తిరిగి చెల్లించాల్సిన మొత్తంలో రూపాయి ఎందుకు తగ్గించిందో ఐఆర్‌సీటీసీ సరైన వివరణ కూడా ఇవ్వలేదని పేర్కొంది.
చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని ఇవ్వకపోవడం సేవల్లో లోపమేనని, ఇది అన్యాయమైన వ్యాపార విధానం కిందకు వస్తుందని కమిషన్ స్పష్టం చేసింది.
వివరాలు
ఐఆర్‌సీటీసీ వాదనను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?
ఒక్క రూపాయే కదా అని తక్కువగా చూడలేమని, ఆ మొత్తం కూడా ప్రయాణికుడికి ముఖ్యమేనని పేర్కొంది.
అందుకే అతడికి రూ.100 పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే కేసు నడిపేందుకు అయిన ఖర్చుల కింద రూ.3,000 చెల్లించేందుకు అర్హుడని తెలిపింది.
చివరగా 2024 ఆగస్టు 17 నుంచి 9 శాతం వడ్డీతో బకాయి ఉన్న రూపాయిని తిరిగి చెల్లించాలని, అదనంగా రూ.100 పరిహారం, రూ.3,000 కోర్టు ఖర్చులు 30 రోజుల్లోగా చెల్లించాలని ఐఆర్‌సీటీసీని ఆదేశించింది.