Kerala: చరిత్ర సృష్టించిన కేరళ.. పేదరికరహిత రాష్ట్రంగా ఘనత!
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ రాష్ట్రం చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. రాష్ట్రంలో తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 1న కేరళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం శాసనసభ వేదికగా మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచిందని ఎల్డీఎఫ్ ప్రభుత్వం గర్వంగా తెలిపింది. 2021లో ప్రారంభమైన 'తీవ్ర పేదరిక నిర్మూలన ప్రాజెక్టు' (Extreme Poverty Eradication Project) కేరళ ప్రభుత్వానికి ఈ విజయం సాధించిపెట్టిందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా 64,006 కుటుంబాలను అత్యంత నిరుపేద (Ultra Poor) వర్గంలోకి చేర్చి, వారిని పేదరికం నుంచి బయటకు తీయడానికి నాలుగేళ్ల ప్రణాళికను రూపొందించారు.
Details
క్షేత్రస్థాయిలో విస్తృత సర్వేలు
స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎం.బి. రాజేశ్ ఈ విజయానికి వెనుక ఉన్న ప్రణాళికను వివరిస్తూ మాట్లాడుతూ నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యల్ప పేదరిక రేటు (0.7%) కేరళలో ఉందని, కానీ ఆ కొద్దిమంది నిరుపేదలను కూడా సాయం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఆహారం, ఆరోగ్యం, నివాసం, విద్య, జీవనోపాధి వంటి ప్రధాన సూచికల ఆధారంగా క్షేత్రస్థాయిలో విస్తృత సర్వేలు నిర్వహించారు. వీటి ద్వారా 64,006 కుటుంబాలకు చెందిన 1,03,099 మందిని గుర్తించి వారికి అవసరమైన ఆర్థిక, సామాజిక, మానవ వనరుల సహాయాన్ని అందించారు. కేరళ ఇప్పుడిది పేదరికరహిత రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఇది దేశ అభివృద్ధి చరిత్రలో ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది.