కేరళ: పాఠశాలలో పోక్సో చట్టం బోధనలు.. అవగాహన కల్పించేలా పాఠాలు
పోక్సో(POCSO) చట్టంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 నుంచి పోక్సో చట్టం గురించి అవగాహన పాఠాలను పాఠాశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని నిర్ణయించింది. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్‌టీ) ప్రస్తుతం దీనిపై పని చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పోక్సో చట్టంపై అవగాహన పాఠాలను బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలపై లైంగిక నేరాలు పెరుగుతున్నాయని కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లలకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు పేర్కొంది.
వచ్చే ఏడాది నుంచి అమలు
I, III, V, VI, VIII, IX తరగతుల విద్యార్థుల కోసం 2024-2025 విద్యా సంవత్సరం నుంచి పోక్సో చట్టాన్ని పాఠ్యాంశంగా చేర్చనున్నట్లు ఎస్సీఈఆర్‌టీ కోర్టుకు హామీ ఇచ్చింది. II, IV, VII, X తరగతలకు 2025-2026 విద్యా సంవత్సరం నుంచి అమలుచేస్తామని స్పష్టం చేసింది. పాఠ్యాంశాల సవరణ తర్వాత ఉపాధ్యాయులకు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారని ఎస్సీఈఆర్‌టీ పేర్కొంది. పోక్సో చట్టంపై రూపొందించే పాఠ్యాంశాన్ని నిపుణులచే తయారు చేయబడుతుందని ఎస్సీఈఆర్‌టీ ఉద్ఘాటించింది. రాష్ట్ర ప్రభుత్వం మేలో పోక్సో అవగాహన అంశంపై ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణను నిర్వహించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీఈఆర్‌టీ, కేఈఎల్ఎస్ఏ చేపట్టిన ప్రయత్నాలను కేరళ హైకోర్టు ప్రశంసించింది.