kerala: నకిలీ సౌందర్య ఉత్పత్తులు, ప్రొటీన్ పౌడర్లపై కేరళ సర్కార్ కొరడా!
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన సౌందర్య క్రీమ్ ఓ బాలిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ముఖంపై మొటిమలు,నల్లమచ్చలు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఆ క్రీమ్ వాడిన 17 ఏళ్ల బాలిక కిడ్నీ వ్యాధి బారినపడింది. మలప్పురం జిల్లాకు చెందిన ఈ బాలికకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు ఉండటంతో వాటిని తొలగించుకునేందుకు బాలిక ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రచారం చేసిన బ్యూటీ క్రీమ్ వీడియోలను చూసింది. ఆ క్రీమ్ వాడితే చర్మం కాంతివంతంగా మారుతుందని వారు చెప్పడంతో ఆకర్షితురాలైంది. వీడియోలో ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కు సంప్రదించి క్రీమ్‌ను ఆర్డర్ చేసింది.
వివరాలు
క్రీమ్‌లో 12,500 పీపీఎం పాదరసం..
మొదట్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లు అనిపించడంతో ఏడాది వ్యవధిలో పలుమార్లు మరిన్ని బాటిళ్లను తెప్పించుకుంది.
ఎలాంటి విరామం లేకుండా ఆ క్రీమ్‌ను ఉపయోగించింది. అయితే, చివరకు అదే ఆమె ఆరోగ్యానికి ముప్పుగా మారింది.
కొంతకాలానికి బాలిక ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెను మలప్పురంలోని ఓ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెకు కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్నట్లు గుర్తించారు.
తాము పరిశీలించిన వివరాల ప్రకారం, ఆమె ఉపయోగించిన సౌందర్య క్రీమ్ కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు వైద్యులు శనివారం వెల్లడించారు.
వివరాలు
క్రీమ్‌లో 12,500 పీపీఎం పాదరసం..
బాలికకు చికిత్స అందిస్తున్న నెఫ్రాలజిస్టు డాక్టర్ ఎస్. గౌరి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
బాలిక రక్తంలో, శరీరంలో ప్రమాదకర స్థాయిలో పాదరసం (మెర్క్యురీ) ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించామని తెలిపారు.
సాధారణంగా సౌందర్య ఉత్పత్తుల్లో పాదరసం పరిమాణం 1 పీపీఎం (PPM) కంటే తక్కువగా ఉండాలి.
అయితే బాలిక ఉపయోగించిన క్రీమ్ నమూనాలను పరీక్షించగా ఏకంగా 12,500 పీపీఎం పాదరసం ఉన్నట్లు తేలిందని వివరించారు.
ఇంత ఎక్కువ మోతాదులో ఉన్న పాదరసం మూత్రపిండాల్లో రక్తాన్ని వడపోసే భాగాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరించారు.
వివరాలు
బాలల హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు..
ఈ ఘటనకు సంబంధించిన వార్తలు మీడియాలో రావడంతో కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది.
ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, తక్షణమే నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
మరోవైపు, నిపుణుల సలహాలు లేకుండా సోషల్ మీడియాలో ప్రచారం చూసి గుర్తింపు లేని సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేసి ఉపయోగించడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ఆన్‌లైన్‌లో లభించే క్రీముల్లో ఏయే రసాయనాలు ఉన్నాయో తెలుసుకోకుండా వాడటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
వివరాలు
నకిలీ కాస్మోటిక్స్,ప్రోటీన్ పౌడర్లపై సర్కారు కొరడా.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు!
నకిలీ సౌందర్య సాధనాలు, ప్రోటీన్ పౌడర్ల విక్రయాలపై కేరళ ప్రభుత్వం చర్యలకు దిగింది.
ఫెయిర్‌నెస్ క్రీములు వాడటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది.
అనుమతులు లేని సౌందర్య, ఆరోగ్య ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఈ ఉత్పత్తులు పాకిస్థాన్‌తో పాటు మంగళూరు-కాసర్‌గోడ్ ప్రాంతం నుంచి కేరళలోకి వస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి కె. మురళీధరన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వివరాలు
నకిలీ కాస్మోటిక్స్,ప్రోటీన్ పౌడర్లపై సర్కారు కొరడా.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు!
మంగళూరు-కాసర్‌గోడ్ ప్రాంతం నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం ద్వారా అనుమతులు లేని కాస్మోటిక్స్, ఆరోగ్య ఉత్పత్తులు కేరళలో విక్రయిస్తున్నారని మంత్రి తెలిపారు.
వాటి తయారీ ఎక్కడ జరుగుతోంది? నాణ్యత ఎలా ఉంది? వినియోగానికి సురక్షితమేనా? అనే అంశాలపై ఆందోళనలు ఉన్నాయని పేర్కొన్నారు.
పాకిస్థాన్ నుంచి వస్తున్న కొన్ని ఉత్పత్తులపై తయారీదారు పేరు, తయారీ తేదీ, గడువు తేదీ వంటి కనీస వివరాలు కూడా ఉండటం లేదని వెల్లడించారు.
ఇలాంటి ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరి ద్వారా విక్రయిస్తున్నారు? అనే విషయాలను గుర్తించి, సరఫరా వ్యవస్థపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వివరాలు
నకిలీ కాస్మోటిక్స్,ప్రోటీన్ పౌడర్లపై సర్కారు కొరడా.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు!
అనుమతులు లేని ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణాలు, సంస్థల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.
అంతేకాకుండా నకిలీ కాస్మోటిక్స్, ప్రోటీన్ పౌడర్లను ప్రచారం చేస్తూ తప్పుడు ప్రకటనలు ఇచ్చే వ్లాగర్లపైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఉత్పత్తుల విక్రయాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.