LOADING...
Telangana: తెలంగాణలో కీలక మార్పులు.. కేబినెట్ నిర్ణయాలతో పరిపాలనలో నూతన అధ్యాయం
తెలంగాణలో కీలక మార్పులు.. కేబినెట్ నిర్ణయాలతో పరిపాలనలో నూతన అధ్యాయం

Telangana: తెలంగాణలో కీలక మార్పులు.. కేబినెట్ నిర్ణయాలతో పరిపాలనలో నూతన అధ్యాయం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక, సంచలన నిర్ణయాలకు వేదికైంది. ముఖ్యంగా గత ప్రభుత్వ కాలంలో విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై నిష్పాక్షిక విచారణ కోసం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇదే సమయంలో భూముల మార్కెట్ విలువల సవరణ, మున్సిపల్ పన్నుల బకాయిలపై వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్), అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు సహాయం, ఐటీఐలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వంటి పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వివరాలు

1. విద్యుత్ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆమోదం

విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికను సీబీఐకి అప్పగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024 మార్చి 14న కమిషన్స్ ఆఫ్ ఇన్క్వైరీ చట్టం ప్రకారం రిటైర్డ్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు కాగా, సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఆయన జూలై 2024లో తప్పుకోవడంతో జస్టిస్ మదన్ బి. లోకూర్‌ను నియమించారు. అక్టోబర్ 2024లో 114 పేజీల నివేదికను సమర్పించారు. 2025 జనవరి 4న కేబినెట్ అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరగా, ఆయన సూచనలపై ఈరోజు చర్చించి సీబీఐ దర్యాప్తు నిర్ణయం తీసుకున్నారు. అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర పీఎస్‌యూలు ఉండటంతో సీబీఐ విచారణ అవసరమని భావించారు.

వివరాలు

2. భూముల మార్కెట్ విలువల సవరణ

రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరల్లో ఉన్న అసమానతలను సరిచేయాలని నిర్ణయించారు. వాస్తవ మార్కెట్ విలువలకు అనుగుణంగా ధరలను రేషనలైజ్ చేయడానికి రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతి ఇచ్చారు. ఈనెల చివరి వారంలో కొత్త విలువలు అమల్లోకి రానున్నాయి. ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణ వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితుల అసంతృప్తి, పరిహారం రేట్లపై వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ పద్ధతిలో ధరలను సవరించనున్నారు. జిల్లాల వారీగా మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు ఈ ప్రక్రియ చేపడతాయి.

Advertisement

వివరాలు

3. హిల్ట్ పాలసీ దరఖాస్తుదారులకు అవకాశం

హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. భూముల ధరలు పెరగకముందే అప్లై చేసిన వారికి 10% ముందుగా చెల్లించే అవకాశం ఇస్తారు. మిగిలిన 90% మొత్తాన్ని 90 రోజుల్లో చెల్లించాలి. వారికి పాత ధరలే వర్తిస్తాయి. 4. రైతులకు సహాయం ఇటీవల అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రులు వెంటనే వివరాలు సేకరించి రైతులకు సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. 5. నార్మాక్‌ను ఎన్‌డీడీబీకి అప్పగింపు నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘం (NARMAC)ను నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ కు అప్పగించే ఎంవోయూకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో డైరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ బాధ్యతలను ఎన్‌డీడీబీ నిర్వహిస్తుంది.

Advertisement

వివరాలు

6. సోలార్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్ల వద్ద సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పైలట్‌గా 18 ప్రాంతాల్లో రూ.66.50 కోట్ల వ్యయంతో 19 మెగావాట్ల ప్రాజెక్టులను అమలు చేయనున్నారు. 7. మున్సిపల్ బకాయిలపై ఓటీఎస్ గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న పన్నుల వసూళ్లకు వన్ టైమ్ సెటిల్మెంట్ అమలు చేయాలని నిర్ణయించారు. మొత్తం రూ.5864 కోట్ల బకాయిల్లో వడ్డీలు, జరిమానాలు మినహాయించి రూ.1686 కోట్లు వసూలవుతాయని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానం అమలు చేయాలని మున్సిపల్ శాఖకు ఆదేశించారు. అలాగే హైదరాబాద్ జలమండలి బకాయిలను కూడా సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.

వివరాలు

8. బుగ్గవాగు కాలువ నిర్మాణం

ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్ ఫ్లడ్ ఫ్లో కాలువ నిర్మాణానికి ఆమోదం ఇచ్చారు. దీని ద్వారా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీటి సరఫరా మెరుగుపడుతుంది. 9. ఐటీఐలు స్కిల్ యూనివర్సిటీ కిందకు రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లు, పాలిటెక్నిక్లు, టీ-శాట్‌ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. 10. ఆధునిక కూరగాయల మార్కెట్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్‌లో ఆధునిక కూరగాయల మార్కెట్ నిర్మాణానికి 42 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Advertisement