LOADING...
Inter Exams New Pattern 2026: ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల మార్కుల విధానంలో కీలక మార్పులు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల మార్కుల విధానంలో కీలక మార్పులు

Inter Exams New Pattern 2026: ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల మార్కుల విధానంలో కీలక మార్పులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2025
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ బోర్డు కొత్త సిలబస్‌ను ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా పరీక్షల విధానంలోనూ కీలక మార్పులు చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు పరీక్షా విధానాన్ని విస్తృతంగా సవరించింది. జాతీయ విద్యా విధానం-2020కు అనుగుణంగా ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌లో సీబీఎస్‌ఈ తరహా విధానాన్ని అమలు చేయనున్నారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, చరిత్ర, ఎకనామిక్స్‌, కామర్స్‌, సివిక్స్‌ వంటి సబ్జెక్టుల సిలబస్‌లో ఈ ఏడాది మార్పులు చేశారు. ఈ సబ్జెక్టులన్నింటికీ ప్రతి పేపర్‌ 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

Details

పాత విధానంలోనే సెకండ్ ఇయర్ పరీక్షలు

ఒక్క మార్కు ప్రశ్నల విధానాన్ని ప్రవేశపెట్టారు. పరీక్షలు రాసేందుకు ఉపయోగించే జవాబు బుక్‌లెట్‌ను 32 పేజీలకు పెంచారు. సిలబస్‌లో ఎలాంటి మార్పులు లేని సబ్జెక్టులకు మాత్రం ఇప్పటివరకు ఉన్నట్లుగానే 24పేజీల జవాబు బుక్‌లెట్‌ను కొనసాగించనున్నారు. ఒక్కో పరీక్షకు కనీసం రెండు రోజుల గ్యాప్‌ ఉండేలా టైంటేబుల్‌ను రూపొందించారు. ఈ మార్పులు 2025-26విద్యా సంవత్సరం ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలకు మాత్రమే వర్తిస్తాయి. సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు మాత్రం ఈ ఏడాది పాత విధానంలోనే నిర్వహిస్తారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌లో సైన్స్‌ గ్రూపుల్లో రెండు లాంగ్వేజీలు, నాలుగు మెయిన్‌ సబ్జెక్టులతో కలిపి మొత్తం ఆరు సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఆర్ట్స్‌ గ్రూపుల్లో రెండు లాంగ్వేజీలు, మూడు మెయిన్‌ సబ్జెక్టులతో కలిపి మొత్తం ఐదు సబ్జెక్టులు ఉన్నాయి.

Details

ఆరో సబ్జెక్టుగా ఎంచుకొనే అవకాశం

అయితే ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని గ్రూపులకు ఐదు సబ్జెక్టుల విధానాన్ని అమలు చేశారు. ఇందులో ఒక లాంగ్వేజ్‌, నాలుగు మెయిన్‌ సబ్జెక్టులు ఉంటాయి. ఇంగ్లిష్‌ తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుంది. రెండో లాంగ్వేజ్‌ను ఆరో సబ్జెక్టుగా ఎలక్టివ్‌గా మార్చారు. అంటే విద్యార్థులు లాంగ్వేజ్‌ లేదా 23 మెయిన్‌ సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదాన్ని ఆరో సబ్జెక్టుగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. మొదటి ఐదు సబ్జెక్టుల్లో ఏదైనా ఒకటిలో ఫెయిల్‌ అయి, ఆరో సబ్జెక్టులో పాస్‌ అయితే ఆ ఆరో సబ్జెక్టును మెయిన్‌ సబ్జెక్టుగా పరిగణిస్తారు. అయితే ఆరో సబ్జెక్టును పరిగణనలోకి తీసుకోవాలంటే ఇంగ్లిష్‌లో తప్పనిసరిగా పాస్‌ కావాలి. సైన్స్‌, ఆర్ట్స్‌ గ్రూపుల్లో 3, 4, 5 సబ్జెక్టులు ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి.

Advertisement

Details

రెండు వేర్వేరు బుక్ లెట్లు ఇస్తారు

మ్యాథమెటిక్స్‌లో ఇప్పటివరకు ఉన్న ఏ, బి పేపర్లకు బదులుగా ఇకపై ఒక్క పేపర్‌ మాత్రమే ఉంటుంది. బైపీసీ గ్రూపులో బోటనీ, జువాలజీ సబ్జెక్టులను కలిపి 'బయాలజీ'గా ఒక్క పేపర్‌గా నిర్వహించనున్నారు. అయితే జవాబులు రాసేందుకు రెండు వేర్వేరు బుక్‌లెట్లు ఇస్తారు. వాటిలో విడివిడిగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఆర్ట్స్‌ గ్రూపుల్లో సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ గ్రూపులకు సంబంధించి మొత్తం 26 కాంబినేషన్లు ఉంటాయి. వీటిలో విద్యార్థులు తమకు నచ్చిన కాంబినేషన్‌ను ఎంచుకునే అవకాశం కల్పించారు. ఈ విధంగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రతి సబ్జెక్టు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. అయితే సైన్స్‌ సబ్జెక్టులైన ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జువాలజీకి 85 మార్కుల చొప్పున రాత పరీక్ష ఉంటుంది.

Advertisement

Details

35 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణత

రెండో ఏడాది పరీక్షల్లో ప్రాక్టికల్స్‌కు 30 మార్కులు ఉంటాయి. ప్రతి పేపర్‌లో 100 మార్కులకు కనీసం 35 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణతగా పరిగణిస్తారు. 85 మార్కుల పేపర్లకు కనీసం 29 మార్కులు సాధించాలి. సైన్స్‌ ప్రాక్టికల్స్‌లో రెండేళ్ల కలిపి 30 మార్కులకు గాను కనీసం 11 మార్కులు తప్పనిసరిగా పొందాలి. ఈసారి పరీక్షల్లో అర మార్కు, 1, 2, 4, 5, 8, 16 మార్కుల ప్రశ్నలు ఇవ్వనున్నారు. అర మార్కు, ఒక్క మార్కు ప్రశ్నలకు తప్ప మిగతా ప్రశ్నలకు ఛాయిస్‌ ఉంటుంది. 2025-26 విద్యా సంవత్సరంలో సెకండ్‌ ఇయర్‌ ఇంటర్‌ విద్యార్థులకు పాత సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించనున్నందున వారికి ఎలాంటి మార్పులు ఉండవని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది.

Advertisement