LOADING...
Telangana: సభలో మూసీ ప్రక్షాళనపై కీలక చర్చ.. గోదావరి నీళ్ల తరలింపుపై ప్రభుత్వం ప్రకటన
సభలో మూసీ ప్రక్షాళనపై కీలక చర్చ.. గోదావరి నీళ్ల తరలింపుపై ప్రభుత్వం ప్రకటన

Telangana: సభలో మూసీ ప్రక్షాళనపై కీలక చర్చ.. గోదావరి నీళ్ల తరలింపుపై ప్రభుత్వం ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 02, 2026
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మూసీ నది ప్రక్షాళనపై సభలో కీలక చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ... మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని స్పష్టంగా ప్రకటించారు. ఫస్ట్ ఫేజ్‌లో గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేపడతామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాలను ఫైనల్ చేస్తామని సీఎం వెల్లడించారు. మూసీ ప్రక్షాళన కోసం ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) రూ.4,100 కోట్ల రుణాన్ని అందించనున్నదని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందని తెలిపారు. వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల్లో అన్ని వివరాలను ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు.

Details

విజయవంతంగా గంగా నది ప్రక్షాళన

యూపీలో గంగా నది ప్రక్షాళన విజయవంతంగా జరిగిందని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. మూసీ నది కలుషితమవడంతో నల్గొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. మూసీ నది ప్రక్షాళన తప్పనిసరి అని పునరుద్ఘాటిస్తూ గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉందన్నారు. గోదావరి జలాలతో మూసీతో పాటు ఈసా నదిని కూడా నింపుతామని సభలో ప్రకటించారు. ఇదే అంశంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వివరాలను వెల్లడించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ఐదు జోన్లుగా విభజించినట్లు తెలిపారు. జోన్-1 డీపీఆర్‌ను నాలుగు వారాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. మూసీ ప్రాజెక్టు 2026ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని, మరో నాలుగు వారాల్లో పూర్తి డీపీఆర్ సిద్ధమవుతుందని వెల్లడించారు

Details

బీఆర్ఎస్ నుంచి ప్రశ్నలు, విమర్శలు

మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అసలు ఎంత ఖర్చు చేయాలని భావిస్తోందో వెల్లడించాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చుతున్నారని ఆరోపించారు. పేదల ఇళ్ల జోలికి రావద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ.. ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం అంగీకరించదన్నారు. పేదల ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నిస్తే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామని హెచ్చరించారు. ముందుగా మూసీలోకి మురికి నీళ్లు చేరకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Details

ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్

మూసీలోకి గోదావరి జలాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచే నీటిని తరలిస్తారా లేదా అనే అంశాన్ని వెల్లడించాలని కోరారు. ఇటీవల వరదల సమయంలో మూసీ గేట్లను ఉద్దేశపూర్వకంగా ఒకేసారి తెరిచారని ఆరోపించారు. దీంతో ఇళ్లు, రోడ్లు మునిగిపోయాయని, ఇది ప్రభుత్వ పెద్దలు కావాలనే చేశారని విమర్శించారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో నాలాలను సరిచేయకుండా మూసీ సుందరీకరణ చేసినా ఉపయోగం ఉండదని మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ వ్యాఖ్యానించారు.

Advertisement