Telangana: 'ఇంటర్' ఎత్తివేతపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) -2020 అమలు కోసం కసరత్తు ప్రారంభించింది. ఈ విధానంలోని కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకురావాలని నిర్ణయించుకుంది. ప్రధానంగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియెట్ విద్యావిధానాన్ని రద్దు చేయాలని చూస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ వేర్వేరు సంస్థల పరిధిలో ఉన్నా, కొత్త విధానం అమల్లోకి వస్తే 'బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్'ను తొలగించి, స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ మార్పుల వల్ల పర్యవేక్షణ సులభం అవుతుందని, సర్కారుపై ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఎన్ఈపీ అమలుపై చర్చ
మరోవైపు, కార్పొరేట్ ఇంటర్ కాలేజీలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. ఎన్ఈపీ - 2020 అమలుతో పొందే ప్రయోజనాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల ఎడ్యుకేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఎన్ఈపీ అమలుపై చర్చ జరిగింది. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కొన్ని ఇతర రాష్ట్రాల్లో అమలవుతుండగా, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు ఇంకా అమలు చేయలేదు. కేంద్రం, ఎన్ఈపీ అమలుపై ఒత్తిడి తీసుకురావడంతో, ఈ అంశంపై రాష్ట్రం దృష్టిసారించింది.
ఒకటో తరగతిలో చేరేందుకు ఆరేళ్లు వయస్సు ఉండాలి
ప్రస్తుత విద్యావిధానంలో రాష్ట్రం 5+2+3+2 విధానం (ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్, ఇంటర్)ను అనుసరిస్తోంది. కానీ, కేంద్రం సూచిస్తున్న కొత్త విధానం 5+3+3+4గా ఉండి, ఇందులో ఇంటర్మీడియెట్ విద్యను సెకండరీ ఎడ్యుకేషన్ కింద చేర్చనుంది. ఒకటో తరగతిలో చేరేందుకు వయస్సు ఆరేళ్లు నిండాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే సమయంలో ఐదో తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన చేయాలన్న ప్రతిపాదనకు సర్కారు సానుకూలంగా ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో ఇప్పటికే ఎన్ఈపీ అమలు ప్రక్రియ మొదలైంది. నాలుగేళ్ల డిగ్రీ, బకెట్ సిస్టమ్, మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ విధానాలను జేఎన్టీయూ వంటి సంస్థలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి.