Page Loader
Manohar Lal Khattar: కేంద్రం కీలక నిర్ణయం.. ఏసీలకు కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు తప్పనిసరి!
కేంద్రం కీలక నిర్ణయం.. ఏసీలకు కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు తప్పనిసరి!

Manohar Lal Khattar: కేంద్రం కీలక నిర్ణయం.. ఏసీలకు కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు తప్పనిసరి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 11, 2025
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఎయిర్ కండీషనర్ల వినియోగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి భాగంగా, ఏసీల ఉష్ణోగ్రతలకు నిర్దిష్ట పరిమితులు విధించేందుకు చర్యలు ప్రారంభించింది. కొత్తగా తయారయ్యే ఏసీలకు కనిష్ఠంగా 20 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠంగా 28 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా ప్రమాణాలు అమలులోకి తేనున్నట్లు కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఇప్పటికే దేశంలోని అనేక ఇళ్లలో, కార్యాలయాలలో 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఏసీలను ఉపయోగిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇది విద్యుత్ వినియోగాన్ని పెంచే ప్రధాన కారణంగా ఉండటంతో, ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

Details

త్వరలోనే కొత్త ప్రమాణాలు

త్వరలోనే కొత్త ప్రమాణాలను అమలు చేయనున్నట్లు వెల్లడించిన ఆయన, ఈ మార్పుల ప్రభావాన్ని సమీక్షించి దేశవ్యాప్తంగా ఏసీల వినియోగంలో ఏకరూపతను తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఏసీలలో కొన్ని కనిష్ఠంగా 16 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత సెట్‌ చేసుకునే అవకాశం ఇస్తుండగా, మరికొన్ని 18 డిగ్రీల వరకూ మినిమం టెంపరేచర్‌ సపోర్ట్‌ చేస్తున్నాయి. కానీ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై కొత్తగా తయారయ్యే ఏసీలు కనిష్ఠంగా 20 డిగ్రీల సెల్సియస్ వద్ద నుంచే పని చేయనున్నాయి. ఇక ఏసీల వినియోగంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) ఒక సర్వేను నిర్వహించింది.

Details

విద్యుత్ బిల్లులపై భారం తగ్గే అవకాశం

ఈ అధ్యయనంలో ఎక్కువగా ఏసీలు 20 నుంచి 21 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నడుస్తున్నట్లు గుర్తించారు. కానీ, వాస్తవానికి 24-25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఏసీ ఉపయోగిస్తే విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుందని బీఈఈ వెల్లడించింది. ప్రతి డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను పెంచినప్పుడు దాదాపు 6 శాతం వరకు విద్యుత్‌ను ఆదా చేయవచ్చని తెలిపింది. ఈ మార్పుల ద్వారా విద్యుత్ బిల్లులపై భారం తగ్గడమే కాకుండా, పర్యావరణాన్ని కలుషితం చేసే కర్బన ఉద్గారాలను కూడా తగ్గించవచ్చని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.