LOADING...
AP Cabinet: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 80కి పైగా అజెండా అంశాలకు ఆమోదం
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 80కి పైగా అజెండా అంశాలకు ఆమోదం

AP Cabinet: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 80కి పైగా అజెండా అంశాలకు ఆమోదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2026
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో 80కు పైగా అజెండా అంశాలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా వివిధ రంగాలకు సంబంధించిన కీలక ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడుల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదించిన దాదాపు రూ.34 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 35 వేల ఉద్యోగాలు సృష్టించబడనున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది.

వివరాలు

ఉండవల్లిలో రూ.426 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి

అలాగే ఉండవల్లిలో రూ.426 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణం కోసం రూ.139 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని అమరావతిలో ఫైవ్‌స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించే ప్రతిపాదనలను క్యాబినెట్ ఆమోదించింది. అదే విధంగా విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచే నిర్ణయానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

వివరాలు

భూముల కేటాయింపులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

పునరుత్పాదక ఇంధన రంగంలో భాగంగా అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు భూముల కేటాయింపులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా బయోగ్యాస్ ప్లాంట్ల స్థాపనకు ప్రోత్సాహకాలు కల్పించే ప్రతిపాదనలకు కూడా ఆమోదముద్ర వేసింది. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తొలి, రెండో దశల అమలుకు సంబంధించి సీఆర్డీఏ పరిధిలో డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల కోసం 95 తాత్కాలిక పోస్టుల మంజూరుకు కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది. మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన, పర్యాటక రంగ ప్రోత్సాహం, రాజధాని నిర్మాణం, పునరుత్పాదక ఇంధన విస్తరణకు దోహదపడే కీలక నిర్ణయాలను ఈ మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు.

Advertisement