Loading...
Andhra Pradesh Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. జేఎస్‌డబ్ల్యూకు రామాయపట్నం పోర్టు.. కియాకు రెండో ప్లాంట్!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. జేఎస్‌డబ్ల్యూకు రామాయపట్నం పోర్టు.. కియాకు రెండో ప్లాంట్!

Andhra Pradesh Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. జేఎస్‌డబ్ల్యూకు రామాయపట్నం పోర్టు.. కియాకు రెండో ప్లాంట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం హైబ్రిడ్ విధానంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు, భూ కేటాయింపులు సహా మొత్తం 30 అంశాలకు పచ్చజెండా ఊపింది.

వివరాలు

రామాయపట్నం పోర్టు బాధ్యతలు జేఎస్‌డబ్ల్యూకు

నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణ కోసం డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌ఓటీ) విధానంలో జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌ను పోర్టు ఆపరేటర్‌గా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ ప్రాజెక్టు కోసం స్థూల ఆదాయంలో 10.08 శాతం రెవెన్యూ షేర్‌ను జేఎస్‌డబ్ల్యూ సంస్థ కోట్ చేసి హెచ్‌1 బిడ్డర్‌గా నిలిచింది. గోధ్రా షిప్పింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ - కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కన్సార్షియం 5.51 శాతం, విశ్వసముద్ర ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 4.5 శాతం రెవెన్యూ షేర్‌ను కోట్ చేశాయి.

దీంతో జేఎస్‌డబ్ల్యూ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డు జారీ చేయడంతో పాటు రాయితీ ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏపీ మారిటైమ్ బోర్డుకు కేబినెట్ అనుమతించింది.

వివరాలు

ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై కసరత్తు

ఈ రాయితీ ఒప్పందం 30 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. అనంతరం మరో 20 ఏళ్ల పాటు పొడిగించుకునే అవకాశం కల్పించారు.

విశాఖపట్నంలో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించిన 'ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్-2026'పై పరిశ్రమల శాఖ రూపొందించిన ముసాయిదా స్టేటస్ నోట్‌ను మంత్రిమండలి పరిశీలించింది.

అవసరమైన మార్పులు చేసిన అనంతరం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

అమరావతి రాజధాని ప్రాంతంలో చేపట్టనున్న అభివృద్ధి పనులతో పాటు భాగస్వామ్య సదస్సులో వివిధ సంస్థలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల (ఎంఓయూలు) అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా కేబినెట్ ఆమోదించింది.

ADVERTISEMENT

వివరాలు

అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.180.68 కోట్లు

ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో అమరావతి రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమం కింద పలు పనులు చేపట్టనున్నారు.

ఇందులో భాగంగా వాగులు, కాలువలకు ఇరువైపులా 48.3 కిలోమీటర్ల మేర గ్రీన్ బఫర్ అభివృద్ధి, గ్రావిటీ కెనాల్ వెంట ల్యాండ్‌స్కేపింగ్, శాఖమూరులో పబ్లిక్ పార్కు, ఉద్దండరాయునిపాలెంలోని అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో మెమోరియల్ పార్కు నిర్మాణం చేపట్టనున్నారు.

ఐదేళ్ల నిర్వహణతో కూడిన ప్యాకేజీ-2 కింద రూ.180.68 కోట్ల పనులకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు. అమరావతిలోని హైకోర్టు భవనంలో హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ, ఫైర్ ఫైటింగ్, లిఫ్టులు, ప్లంబింగ్ పనుల నిర్వహణకు రూ.431.79 కోట్లు కేటాయించారు.

ఈ పనులను ఎల్‌1 బిడ్డర్‌కు అప్పగించేందుకు అనుమతించారు.

ADVERTISEMENT

వివరాలు

అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ.379.82 కోట్లు

అమరావతిలో నిర్మించనున్న శాసనసభ భవనానికి సంబంధించి స్పైర్, రూఫ్, ఆర్‌సీసీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్, పనోరమిక్, ఇంక్లైన్డ్ లిఫ్టులు, వాటర్ ప్రూఫింగ్, ఇతర సివిల్ నిర్మాణ పనులకు రూ.379.82 కోట్లతో ఎల్‌1 బిడ్డర్‌కు లెటర్ ఆఫ్ అవార్డు (ఎల్‌ఓఏ) జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు.

అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, జీఏడీ టవర్, టవర్లు 1, 2, 3, 4 నిర్మాణాలకు గతంలో రూ.4,688.83 కోట్లతో ఇచ్చిన అనుమతులను సవరించారు.

అదనపు స్ట్రక్చరల్ స్టీల్, డయాగ్రిడ్ నిర్మాణం తదితర పనులతో కలిపి మొత్తం రూ.6,641.21 కోట్లతో పనులు చేపట్టేందుకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు

వివరాలు

గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.1,215.70 కోట్లు

అమరావతి పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రతిపాదించిన పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

రెండేళ్ల నిర్వహణతో కలిపి రూ.1,215.70 కోట్ల విలువైన పనులకు ఏపీసీఆర్‌డీఏ తీర్మానం మేరకు బిడ్లు పిలిచేందుకు కమిషనర్‌కు అనుమతి ఇచ్చింది.

శాఖమూరు సమీపంలో 'అమరావతి సంగమం' పేరుతో రాష్ట్ర పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ నిర్మించనున్నారు.

రెండేళ్ల డిఫెక్ట్ లయబులిటీతో కలిపి రూ.626.14 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు బిడ్లు పిలిచి, ఎల్‌ఓఏ జారీ చేసేందుకు అనుమతించారు.

అసెంబ్లీ భవనానికి అవసరమైన ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, లిఫ్టులు, ఫైర్ అలారం, డిటెక్షన్ అండ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఈఎల్‌వీ, ప్లంబింగ్ పనులనులంప్‌సమ్ కాంట్రాక్ట్ విధానంలో చేపట్టనున్నారు.

వివరాలు

కియాకు రెండో ప్లాంట్.. రూ.19 వేల కోట్ల పెట్టుబడులు

రూ.353.51 కోట్ల విలువైన ఈ పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టు సంస్థకు అప్పగించేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి ఇచ్చారు.

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రెండో ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ తయారీ కోసం చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం, భూ కేటాయింపుల సిఫార్సులకు ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం రూ.19 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

ఇందులో కియా సంస్థ రూ.15,200 కోట్లు, అనుబంధ వెండర్లు రూ.3,800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. తద్వారా 12 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

వివరాలు

సెయింట్ గోబైన్, అదానీ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ.1,800 కోట్ల పెట్టుబడితో 1,200 టీపీడీ ఫ్లోట్ గ్లాస్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న సెయింట్ గోబైన్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రోత్సాహకాలు కల్పించేందుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) చేసిన సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ ప్రాజెక్టు ద్వారా 150 మందికి ఉపాధి లభించనుంది.

శ్రీకాకుళం జిల్లాలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రూ.13,667 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్ ప్రాజెక్టుకు కూడా టైలర్‌మేడ్ విధానంలో ప్రోత్సాహకాలు అందించేందుకు ఆమోదం తెలిపింది.

వివరాలు

ఏటీసీ టైర్స్ విస్తరణ.. 350 మందికి ఉద్యోగాలు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఏపీసెజ్‌లో రూ.1,047.47 కోట్ల పెట్టుబడితో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న ప్యాసింజర్ కార్ రేడియల్ (పీసీఆర్) టైర్ తయారీ విస్తరణ ప్లాంటుకు ప్రోత్సాహకాలు కల్పించనున్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా 350 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

చిత్తూరు జిల్లాలో 13.33 ఎకరాల్లో రూ.266 కోట్ల పెట్టుబడితో ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్ గ్లోబల్ క్లోతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న వస్త్ర తయారీ ప్లాంటుకు కూడా టైలర్‌మేడ్ విధానంలో ప్రోత్సాహకాలు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ పరిశ్రమ ద్వారా 3,103 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

వివరాలు

లాజిస్టిక్స్, డిఫెన్స్ రంగాలకు భూ కేటాయింపులు

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెంలో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు చేసేందుకు అవంతి వేర్‌హౌసింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మరో 30 ఎకరాలు కేటాయించనున్నారు.

ఎకరాకు రూ.88 లక్షల చొప్పున భూమి కేటాయించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

అలాగే శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరులో ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సెంటర్ ఫర్ అటానమస్ డిఫెన్స్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ఏర్పాటు కోసం 86 ఎకరాలు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

వివరాలు

పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

నంద్యాల జిల్లా బేతంచర్ల, డోన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న 210 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి జెంటారి రెన్యువబుల్స్ ఇండియా క్యాస్టర్ వన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ చేసేందుకు కేబినెట్ అనుమతించింది.

ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన రెవెన్యూ, ప్రైవేటు భూములను లీజు విధానంలో తీసుకునేందుకు ఆమోదం తెలిపింది.

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరంలో రోజుకు 12 టన్నుల సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఆర్‌వీఏఎస్ రీజెన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతి ఇచ్చింది.

వివరాలు

కోల్ ఇండియాతో విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఒప్పందం

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడంతో పాటు ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి పలు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు (స్టోరేజీతో, స్టోరేజీ లేకుండా), అణు విద్యుత్ ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు.

దేశంలోని బొగ్గు గనుల సమీపంలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కోల్ ఇండియా లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు అనుమతి ఇచ్చారు.

ఈ ప్రాజెక్టుల్లో 50 శాతం ఈక్విటీ భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలన్న జెన్‌కో ఎండీ ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపారు.

వివరాలు

పలు సంస్థలకు భూముల కేటాయింపు.. లీజు విధానంలో అనుమతులు

చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం మొగిలి గ్రామంలో రూ.228.27 కోట్ల పెట్టుబడితో శ్రీని ఫుడ్‌పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న ఐస్‌క్రీం తయారీ యూనిట్‌కు టైలర్‌మేడ్ విధానంలో ప్రోత్సాహకాలు చెల్లించేందుకు ఆమోదం తెలిపారు.

ఈ పరిశ్రమ ద్వారా 251 మందికి ఉపాధి లభించనుంది. వైఎస్సార్ కడప జిల్లా మైలవరంలో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.

ఇందుకోసం 1,127.59 ఎకరాలను ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్/నెడ్‌క్యాప్‌కు 33 ఏళ్ల పాటు లీజుకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

ఎకరాకు ఏడాదికి రూ.30 వేల లీజు అద్దె నిర్ణయించారు. ప్రతి ఐదేళ్లకు అద్దెను 10 శాతం పెంచనున్నారు.

వివరాలు

ఏపీఎన్‌హెచ్‌ఏఎల్ వాటాల మార్పునకు ఆమోదం

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారిచెరువు, ఊరుచింతల గ్రామాల్లో 31.46 ఎకరాలను పవన విద్యుత్ ప్రాజెక్టుల కోసం నెడ్‌క్యాప్‌కు 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నారు. ఎకరాకు ఏడాదికి రూ.31 వేల చొప్పున అద్దె నిర్ణయించగా, ప్రతి రెండేళ్లకు లీజు మొత్తాన్ని 5 శాతం పెంచనున్నారు.

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ కంపెనీ ఏపీ ఎన్‌జీఈఎల్ హరిత్ అమృత్ లిమిటెడ్ (ఏపీఎన్‌హెచ్‌ఏఎల్)లో వాటాల నిష్పత్తిని మార్చనున్నారు.

ప్రస్తుతం ఎల్‌జీఈఎల్, నెడ్‌క్యాప్ మధ్య 50:50గా ఉన్న వాటాలను 51:49కి మార్చాలన్న నెడ్‌క్యాప్ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

వివరాలు

5,324 మంది రైతుల భూములకు సంబంధించి కీలక నిర్ణయం

రైల్వేకోడూరు మండలంలోని తొమ్మిది గ్రామాల్లో 5,324 మంది పట్టాదారులకు చెందిన 10,192.14 ఎకరాల భూముల విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

వివిధ సర్వే నంబర్లలో ఉన్న ఈ భూములకు సంబంధించి వెబ్‌ల్యాండ్ అడంగల్ కాలమ్ నంబర్ 6లో 'అతుకుబడి పట్టా'గా ఉన్న నమోదును 'జిరాయితీ పట్టా'గా మార్చేందుకు ఆమోదం తెలిపింది.

తిరుపతి కలెక్టర్, సీసీఎల్‌ఏ సిఫార్సుల మేరకు ఈ సవరణలు చేపట్టనున్నారు.

వివరాలు

ఎంఎస్‌ఎంఈల కోసం రైట్ టు బిజినెస్ బిల్లు

రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నిర్వహణను సులభతరం చేయడంతో పాటు వాటిపై నియంత్రణ భారాన్ని తగ్గించేందుకు 'ఏపీ ఎంఎస్‌ఎంఈ (రైట్ టు బిజినెస్) బిల్-2026' అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ బిల్లు ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సులభతరం చేయనున్నారు.

స్వీయ ధ్రువీకరణ, నిర్ణీత గడువులోగా అనుమతులు, సాధారణ తనిఖీల నుంచి మినహాయింపులు కల్పించనున్నారు. తద్వారా ఎంఎస్‌ఎంఈలకు వ్యాపార నిర్వహణ మరింత సులభతరం కానుంది.

వివరాలు

పారిశ్రామిక పార్కు అభివృద్ధికి రూ.1,500 కోట్ల రుణం

చిత్తూరు జిల్లా విజయపురం మండలం కోసలనగరం ఇండస్ట్రియల్ పార్క్‌లోని బ్లాక్-ఎ భూసేకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.1,500 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ అనుమతించింది.

దిల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.2,000 కోట్ల దీర్ఘకాలిక రుణం మంజూరైన తర్వాత ఈ రూ.1,500 కోట్లను తిరిగి చెల్లించనున్నారు.

దీర్ఘకాలిక రుణానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వనుంది.

వివరాలు

పారిశ్రామిక కారిడార్లు, కెమికల్ పార్కుకు ఆమోదం

ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐసీడీసీ) భూముల కేటాయింపు, భూముల ధరల విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

శ్రీకాకుళం జిల్లా మూలపేటలో 'భవ్య రసాయన్' పథకం కింద గ్రీన్‌ఫీల్డ్ కెమికల్ పార్క్ అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు కూడా పచ్చజెండా ఊపింది.

సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీకి ఐదు పోస్టులు

సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ శాఖ (డీఎస్‌టీఐ) పరిధిలోని ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ (ఏపీఎస్‌టీఏ)కి ఐదు పోస్టులు కేటాయించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

వివరాలు

9,917 ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగింపు

అనంతపురం జిల్లా విడపనకల్లు, యాడికితో పాటు మరో 11 మండలాల్లోని 2,027 సర్వే నంబర్ల పరిధిలో ఉన్న 9,917.37 ఎకరాల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించనున్నారు.

ఈ భూములను 4,352 మంది పట్టాదారుల పేరిట రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

క్లౌడ్ సేవల కోసం రెండు సంస్థలకు రూ.27.94 కోట్లు

మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సేవల కోసం అల్వీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (మాండెల్‌బల్బ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియం)కు రూ.13.97 కోట్లు చెల్లించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

అలాగే గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ సేవల కోసం పారాడిగమ్ ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు మరో రూ.13.97 కోట్లు చెల్లించేందుకు అనుమతించింది.

ADVERTISEMENT