LOADING...
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఓటమి దిశగా టీఎంసీ అడుగులు.. దీదీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలివే..!
దీదీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలివే..!

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఓటమి దిశగా టీఎంసీ అడుగులు.. దీదీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలివే..!

వ్రాసిన వారు Sirish Praharaju
May 04, 2026
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దాదాపు పదేళ్లకు పైగా ఆధిపత్యం కొనసాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఫలితాల ధోరణి చూస్తే, పదిహేనేళ్లుగా కొనసాగుతున్న మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలికేలా ప్రజలు తీర్పు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా మహిళల భద్రతపై పెరిగిన ఆందోళనలు, అవినీతి ఆరోపణలు, విపక్షాల వ్యూహాలు కలిసి పార్టీపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీదీ ఓటమికి కారణమైన ఐదు ముఖ్య అంశాలు ఇవి.

వివరాలు 

మహిళల అసంతృప్తి ప్రభావం

మహిళల మద్దతే తన బలం అని భావించిన మమతా బెనర్జీకి ఈసారి అదే వర్గం నుంచి ప్రతికూల స్పందన ఎదురైంది. 2012లో పార్క్ స్ట్రీట్ ఘటనపై ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో విమర్శలకు దారితీశాయి. ఇటీవల ఆర్జీ కార్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో మహిళల భద్రతపై సందేహాలు పెరిగి, ఇది పార్టీ ఓట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.

వివరాలు 

అవినీతి ఆరోపణల ప్రభావం

తృణమూల్ కాంగ్రెస్ పాలనలో వెలుగులోకి వచ్చిన అవినీతి ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలు న్యాయస్థానాల దృష్టికి వెళ్లడం పెద్ద చర్చగా మారింది. మాజీ మంత్రి పార్థ చటర్జీ అనుచరుల వద్ద భారీ మొత్తంలో నగదు స్వాధీనం కావడం,ఆ దృశ్యాలు ప్రజల్లో విస్తృతంగా వ్యాపించడం పార్టీకి నష్టాన్ని కలిగించింది. శారద, నారద వంటి పాత కేసులు మళ్లీ ప్రస్తావనకు రావడం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

Advertisement

వివరాలు 

ఓట్ల తొలగింపు ఎఫెక్ట్..

బంగ్లాదేశ్ నుంచి అక్రమ ప్రవేశాలకు ప్రభుత్వం సహకరించిందనే ఆరోపణలు కూడా రాజకీయంగా ప్రతికూలంగా మారాయి. అక్రమంగా వచ్చినవారు ఓటు హక్కు పొందారని, స్థానికుల జీవనోపాధిపై ప్రభావం చూపారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక పరిశీలనలో సుమారు 89 లక్షల ఓటర్ల పేర్లు తొలగించబడినట్లు సమాచారం. వీరిలో చాలామంది తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతుదారులేననే ప్రచారం పార్టీకి నష్టం కలిగించింది.

Advertisement

వివరాలు 

ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం

పదిహేనేళ్లపాటు నిరంతరం అధికారంలో ఉండటం వల్ల సహజంగానే ప్రజల్లో కొంత అసంతృప్తి పెరిగింది. నిరుద్యోగం, స్థానిక నేతల వ్యవహార శైలి, కేంద్ర నిధుల అంశంపై కేంద్రంతో జరిగిన విభేదాలు అభివృద్ధికి అడ్డుగా మారాయనే అభిప్రాయం పెరిగింది. ఇది ప్రత్యర్థి పార్టీకి అనుకూల పరిస్థితిని కల్పించింది.

వివరాలు 

విపక్షాల వ్యూహాలు ప్రభావం

కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం జరిగినా, అవినీతిపై పోరాటంగా విపక్షాలు ప్రజల్లో బలంగా ప్రచారం చేశాయి. అలాగే మతపరమైన ఓటర్ల ఏకీకరణ, కేంద్ర పథకాల ప్రచారం కూడా విపక్షాలకు మైలేజీ తీసుకువచ్చాయి. ఇవన్నీ కలిపి తృణమూల్ కాంగ్రెస్ వెనుకంజకు కారణమయ్యాయి.

Advertisement