
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు
ఈ వార్తాకథనం ఏంటి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 20,104 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయింది. వీటిలో 5,364 ఇళ్లు బేస్‌మెంట్, గోడల స్థాయిలో నిర్మాణం పూర్తవగా, ఇందుకు గాను సర్కార్ రూ.53.64 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం 5140 ఇళ్లు బేస్‌మెంట్ స్థాయిలో, 300 ఇళ్లు గోడల స్థాయిలో నిర్మాణం పూర్తయ్యాయి. ఇంకా 10 ఇళ్లు శ్లాబ్ దశ వరకు చేరుకున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఆర్థికంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా సాగేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతి సోమవారం నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, చెల్లింపుల ప్రక్రియలో మధ్యవర్తుల ప్రభావం లేకుండా వ్యవస్థను రూపొందించింది.
Details
మొత్తం నాలుగు విడతల్లో చెల్లింపులు
పైలట్ ప్రాజెక్ట్ కింద మొత్తం 47,335 ఇళ్లను మంజూరు ప్రభుత్వం చేసింది. నిధుల విడుదలను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలోకి జమ చేయనుంది. మొత్తం నాలుగు విడతల్లో చెల్లింపులు చేయనున్న విధానం ఇలా ఉంది: బేస్‌మెంట్ పూర్తయిన తర్వాత రూ.1,00,000 గోడలు పూర్తయిన తర్వాత రూ.1,25,000 శ్లాబ్ పూర్తయిన తర్వాత రూ.1,75,000 ఇళ్లు పూర్తయిన తర్వాత మిగిలిన రూ.1,00,000 వానకాలం ముందు వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా లబ్దిదారుల చెల్లింపుల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ సాంకేతిక, పారదర్శక విధానం ద్వారా లక్షలాది గృహ నిర్మాణాలకు వేగం చేరనున్నది.