
Chandrababu: ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. పునర్విభజన చట్టంలో అమరావతి పేరు.. క్యాబినెట్ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించగా, ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో, రాష్ట్ర క్యాబినెట్ ఆయనకు ధన్యవాదాలు తెలిపింది.
మరోవైపు, ఇటీవల నిర్వహించిన 47వ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూములను కేటాయించే అంశానికి కూడా ఆమోదముద్ర వేసింది.
వివరాలు
త్రివిధ దళాలకు క్యాబినెట్ అభినందనలు
'తల్లికి వందనం', 'అన్నదాత సుఖీభవ' వంటి సంక్షేమ కార్యక్రమాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
అంతేగాక, తీర ప్రాంత భద్రతపై,రక్షణ రంగ పరిశ్రమల చుట్టూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు.
ఇటీవల నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' లో పాల్గొన్న భారత త్రివిధ దళాలకు క్యాబినెట్ అభినందనలు తెలిపింది.
అంతేకాక, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 'అమరావతి' పేరును జోడించాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం సానుకూలంగా స్పందించింది.
ఏపీ రాజధాని పేరుగా అమరావతిని పేర్కొనాలన్న నిర్ణయాన్ని మంజూరు చేసింది.
వివరాలు
పెండింగ్‌లో ఉన్న మూడు బిల్లులు.. వెనక్కి తీసుకోవాలని ప్రతిపాదన
రాష్ట్ర పర్యాటక అభివృద్ధిని మరింత బలోపేతం చేయడానికి మెగా ఈవెంట్లను నిర్వహించాలన్న యోజనకు మంత్రివర్గం మద్దతు తెలిపింది.
మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే 281 పనులను హైబ్రిడ్ యాన్యూటీ పద్ధతిలో అమలు చేయడానికి ఆమోదం తెలిపింది.
అంతేగాక, కేంద్ర ప్రభుత్వ వద్ద పెండింగ్‌లో ఉన్న మూడు బిల్లులను వెనక్కి తీసుకోవాలన్న ప్రతిపాదనకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.