Modi-Putin: 'ఇంధన భద్రతే కేంద్రబిందువు': మోదీ-పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక ప్రకటనలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా న్యూఢిల్లీ హైద్రాబాద్ హౌస్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ-రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల సంయుక్త పత్రికా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2030 వరకూ ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచే లక్ష్యంతో 'ఆర్థిక సహకార కార్యక్రమం'ను ప్రారంభించారు. దశాబ్దాలుగా ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ భారత్-రష్యా స్నేహబంధం మరింత బలపడుతూనే ఉందని మోదీ పేర్కొన్నారు. "గత 80 ఏళ్లుగా భారత్-రష్యా మైత్రి ధృవతారలా నిలిచింది" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇంధన సరఫరా
భారత్‌కు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని రష్యా హామీ
ఈ సమావేశంలో ఎరువులు, ఆహార భద్రత, ఆరోగ్యం, వలసల అంశాలు,నౌకాయాన రవాణా,ఇంధన రంగాలతో పాటు పలు కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. భారత్‌కు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని రష్యా హామీ ఇచ్చింది. యూరాల్కెమ్ సంస్థతో కలిసి రష్యాలో యూరియా కర్మాగారం ఏర్పాటు చేయడానికి భారత కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. ఆహార భద్రత, వినియోగదారుల రక్షణ కోసం భారత ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ-రష్యా వినియోగదారుల పరిరక్షణ సంస్థ మధ్య అవగాహన ఒప్పందాలు పూర్తయ్యాయి. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు రష్యాలో రెండు కొత్త కాన్సులేట్లు ప్రారంభించామని, రష్యన్ పౌరులకు ఉచితంగా 30 రోజుల ఈ-టూరిస్ట్ వీసా, 30 రోజుల గ్రూప్ టూరిస్ట్ వీసా సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చినట్లు మోదీ ప్రకటించారు.
వ్యూహాత్మక సంబంధాలు
భాగస్వామ్యానికి కీలకమైన అంశం ఇంధన భద్రత, వ్యూహాత్మక సహకారం
ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడుతూ, ఆరంభం నుంచే భారత్ శాంతికే కట్టుబడి ఉందని, దీర్ఘకాలిక పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో శాంతి సాధనకు భారత్ సహకరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇంధన భద్రత ఇరు దేశాల సహకారానికి ప్రధాన భూమిక అని మోదీ చెబుతూ, పౌర అణుశక్తి, కీలక ఖనిజాల రంగాల్లో కొనసాగుతున్న భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా సురక్షిత సరఫరా శ్రేణులు ఏర్పడేందుకు తోడ్పడుతుందని తెలిపారు. ఈ సహకారం స్వచ్ఛ ఇంధనం, హైటెక్ తయారీ, కొత్త పరిశ్రమలకు బలం చేకూరుస్తుందని అన్నారు. భారత్‌లో నిర్మాణంలో ఉన్న అణుశక్తి కేంద్రాన్ని ప్రస్తావిస్తూ, ఇంధన సరఫరా ఎప్పటిలాగే నిరంతరంగా కొనసాగిస్తామని పుతిన్ భరోసా ఇచ్చారు.
దౌత్య పర్యటన
ఆర్కిటిక్ కార్యకలాపాలు, RT, BRICS
ఆర్కిటిక్ ప్రాంత కార్యకలాపాల్లో కలిసి పనిచేయడం, ధ్రువ జలాల్లో నావికుల శిక్షణ వంటి అంశాల్లో రెండు దేశాలు సహకరిస్తున్నాయని పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడం, జాతీయ కరెన్సీల్లోనే వాణిజ్య లావాదేవీలు చేయడంపై చర్యలు కొనసాగుతున్నాయని పుతిన్ తెలిపారు. భారతదేశంలో ఆర్‌టీ చానల్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తూ, రష్యా విషయాలను నిష్పక్షపాతంగా చూపించేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. బ్రిక్స్ వేదికపై మోదీతో కలిసి విదేశాంగ విధాన అంశాల్లో పనిచేస్తున్నామని, మరింత న్యాయమైన, బహుళ ధ్రువాల ప్రపంచ నిర్మాణమే లక్ష్యమని పుతిన్ స్పష్టం చేశారు.