
AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక మలుపు.. రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్‌కు నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ రజత్ భార్గవకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవ ఇటీవలే పదవీ విరమణ చేశారు. సిట్ జారీ చేసిన నోటీసుల మేరకు ఆయనను శుక్రవారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్నదిగా చెబుతున్న ఈ మద్యం కుంభకోణంపై ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది.
Details
ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టు
ఇప్పటికే అనేక మందిని విచారించిన సిట్, కొంతమందిని అరెస్ట్ చేయగా, తాజాగా రజత్ భార్గవను కూడా విచారణకు పిలవడం ఈ కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు. డాక్టర్ రజత్ భార్గవ తన పదవీ కాలంలో ఎక్సైజ్, పరిశ్రమలు, ఆర్థిక శాఖలతో పాటు ముఖ్యమైన పదవులను నిర్వహించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన ఆయనపై, గత ప్రభుత్వ హయాంలో మద్యం కొనుగోలు, సరఫరా,ధరల నిర్ణయంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రైవేట్ మద్యం సిండికేట్‌లతో కుమ్మక్కై విధానాలు రూపకల్పన చేశారన్న ఆరోపణల నేపథ్యంలోనే సిట్ ఈ విచారణ చేపట్టనుంది. మద్యం వ్యవస్థపై జరిగిన అవకతవకల పట్ల ప్రజల్లో పెరిగిన శంకల మధ్య, రజత్ భార్గవ విచారణ కేసులో కీలక మలుపుగా నిలవనుంది.