LOADING...
Devji: ఆపరేషన్ కగార్‌లో కీలక మలుపు.. లొంగిపోయిన మావోయిస్టు నేత దేవ్ జీ
ఆపరేషన్ కగార్‌లో కీలక మలుపు.. లొంగిపోయిన మావోయిస్టు నేత దేవ్ జీ

Devji: ఆపరేషన్ కగార్‌లో కీలక మలుపు.. లొంగిపోయిన మావోయిస్టు నేత దేవ్ జీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2026
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్ కగార్ కింద కేంద్ర కమిటీ సభ్యుడు, టాప్ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, రాజిరెడ్డి తదితర 16 మందితో కలిసి తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు. రేపోమాపో వీరి సమక్షాన్ని మీడియాకు పరిచయం చేయాల్సి ఉంది. కేంద్ర హోంశాఖకు 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేయాలన్న టార్గెట్ ఉంది, ఇందులో భాగంగానే ఆపరేషన్ కగార్ చేపట్టారు. ఇప్పటికే పలువురు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయగా, మరికొందరు పలు రాష్ట్రాల్లో లొంగిపోయారు. దేవ్ జీ, రాజిరెడ్డి కూడా లొంగుబాటు కోసం సిద్ధమైనట్లు సమాచారం. తిరుపతి అలియాస్ దేవ్ జీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టు నాయకత్వాన్ని చేపట్టారు.

Details

పోలీసుల అదుపులో దేవ్ జీ

హిడ్మా సహా సీనియర్ మావోయిస్టులు ఏపీ ఎన్‌కౌంటర్లలో మరణించిన తర్వాత దేవ్ జీ ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారనే ఊహాగానాలు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించగా, ఏపీ పోలీసులు హైకోర్టుకు ఆయన తమ ఆధీనంలో లేరని తెలిపారు. పోలీసు రికార్డుల ప్రకారం, తిరుపతి అలియాస్ దేవ్ జీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర్ నగర్ కాలనీకి చెందినవారు. 1983లో డిగ్రీ చదువుతున్న సమయంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) భావజాలంతో ఆకర్షితులయ్యారు. అప్పుడు ABVP, RSU విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు సాధారణం. 1983 చివరిలో అజ్ఞాతంలోకి వెళ్లి కేడర్ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరోలో కూడా ఉన్నారు.

Details

మొదటి సాయుధ ప్లాటూన్ సృష్టి కర్త ఈయనే

2009లో కేంద్ర కమిటీ సమావేశంలో సైనిక శిక్షణా కేంద్రం బునియాడి ట్రైనింగ్ స్కూల్‌ను ప్రారంభించడంలో పాలుపంచుకున్నారు. 2010లో దంతెవాడ దాడిలో 74 సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి ఆయన వ్యూహకర్తగా ఉన్నారని రికార్డులు చెబుతున్నాయి. దంతెవాడలో 2007 దాడిలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) మొదటి సాయుధ ప్లాటూన్ సృష్టి కూడా ఆయనకు చెందిన ఘనత.

Advertisement

Details

తెలంగాణ కేంద్రంగా మక్కాం

భద్రతా సంస్థల ప్రకారం, దేవ్ జీ దక్షిణ ఛత్తీస్ ఘడ్, బస్తర్, దంతెవాడ, మహారాష్ట్ర, ఒడిశా ప్రాంతాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యూహకర్త. సైనిక శిక్షణ శిబిరాల నిర్వహణ, కొత్త నియామకాల అమలు ఆయనకే చెందుతుంది. ఇటీవల, ఆపరేషన్ కగార్2లో భద్రతా బలగాలు మావోయిస్టులపై దూకుడుగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో, దేవ్ జీ ఆయుధాన్ని వదలి ప్రజాక్షేత్రంలోకి రావడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్థావరాలను మారుస్తూ, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ కేంద్రంగా మక్కాం ఏర్పాటు చేసినట్లు కూడా వార్తలొచ్చాయి.

Advertisement