
Talliki Vandanam: రేపు తల్లుల ఖాతాల్లోకి జమ కానున్న తల్లికి వందనం స్కీమ్ డబ్బులు .. పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలంటే..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ "తల్లికి వందనం" పథకానికి సంబంధించిన మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. జూలై 10 (రేపు) తేదీన ఈ పథకంలో రెండో విడత నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో డబ్బులు అందని లబ్దిదారులతో పాటు, ప్రస్తుతం ప్రథమ తరగతి లేదా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చేరిన విద్యార్థుల తల్లులకు ఈ విడత నిధులు జమ కానున్నాయి. ఈ విడతలో మొత్తం 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. వీరు ప్రథమ తరగతి,ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నవాళ్లే కాకుండా, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయలు, సీబీఎస్‌ఈ బోర్డుకు చెందిన విద్యాసంస్థల్లో చదువుతున్నవారూ ఉంటారు. వీరి పేర్లను ఇప్పటికే అర్హుల జాబితాలో చేర్చారు.
వివరాలు
ఈ విడతలో, మొత్తం 7,99,410 మంది విద్యార్థులు
ఈ విడతలో, మొత్తం 7,99,410 మంది విద్యార్థులకు సంబంధించిన 7,84,874 మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రూ.13,000 చొప్పున నగదును జమ చేయనుంది. గతంలో వీరిని మినహాయించి మిగిలిన వారికి నగదు చెల్లింపు పూర్తయ్యింది. అర్హత ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అనర్హులుగా తేలిన కొందరు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు చేశారు. వీరి అభ్యర్థనలను పరిశీలించిన తర్వాత అర్హులుగా గుర్తించిన వారికి కూడా ఇప్పుడు డబ్బులు జమ చేయనున్నారు. గత విడతలో మొత్తం 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం లభించింది. ప్రతి అర్హ విద్యార్థి తల్లి ఖాతాలోకి రూ.13,000 నగదు జమవుతుంది.
వివరాలు
రూ.2,000ను జిల్లా కలెక్టర్ ఖాతాలోకి..
మొత్తం రూ.15,000 అందించనున్న ఈ పథకంలో మిగిలిన రూ.2,000ను జిల్లా కలెక్టర్ ఖాతాలోకి బదలిస్తారు.. ఈ విషయాన్ని ప్రభుత్వం ముందుగానే స్పష్టంగా తెలిపింది. ఈ పథకం క్రింద రూ.10,000లోపు వార్షిక ఆదాయమున్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు, నెలకు 300 యూనిట్ల కరెంట్ వినియోగాన్ని మించి ఖర్చు చేయని వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అదనంగా, విద్యార్థికి కనీసం 75శాతం హాజరు అవసరం. ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా ఉండాలి. ఇంట్లో ఫోర్ వీలర్ (కేవలం ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్లకు మినహాయింపు) ఉంటే అనర్హత వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు కూడా అర్హులు కారు. ఈ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.
వివరాలు
మీ పేమెంట్ స్టేటస్‌ను ఇలా చెక్ చేసుకోవచ్చు:
తల్లికి వందనం పథకానికి సంబంధించిన స్టేటస్‌ను చెక్ చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాన్ని ఉపయోగించి మీరు మీ స్టేటస్‌ను ఈ విధంగా తెలుసుకోవచ్చు: ముందుగా https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP వెబ్ సైట్ లోకి వెళ్లాలి. వెబ్ సైట్ లోకి వెళ్లి తర్వాత... స్కీమ్ ఆప్షన్ లో తల్లికి వందనం పథకాన్ని ఎంచుకోవాలి. సంవత్సరం దగ్గర 2025-2026 ను ఎంపిక చేసుకోవాలి. ఆ పక్కన ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయాలి. ఆపై గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.