
Annadata Sukhibhav : అన్నదాత సుఖీభవ పథకంపై కీలక అప్డేట్.. మీ పేరు జాబితాలో లేకపోతే ఇలా చేయండి!
ఈ వార్తాకథనం ఏంటి
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీ వ్యవసాయశాఖ. ఇప్పటికే ప్రకటించిన లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేవంటూ ఆందోళన చెందుతున్న రైతులకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. ఈ నెల 23వ తేదీ వరకు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్స్‌లో వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించామని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు.
Details
ఏటా రూ.20 వేలు సహాయం
రైతుల పంట పెట్టుబడి ఖర్చుల భారం తేలిక చేయడం లక్ష్యంగా, ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.20,000 నిధులను మూడు విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఇందులో రూ.6,000 కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులు, మిగిలిన రూ.14,000ను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ నెలలోనే పీఎం కిసాన్ యోజన (20వ విడత) కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.2,000 చొప్పున నిధులు విడుదలయ్యే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం సుఖీభవ కింద రూ.5,000 చొప్పున జమ చేయనుంది. అంటే రైతులకు తొలి విడతలోనే మొత్తం రూ.7,000 అందే అవకాశముంది. మిగిలిన రెండు విడతల సాయం అనంతరంగా జమ చేస్తారు.
Details
అర్హుల జాబితా వెబ్‌సైట్‌లో
అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాను ఇప్పటికే వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అర్హత కలిగిన రైతులు తమ స్టేటస్ తెలుసుకునేందుకు [https://annadathasukhibhava.ap.gov.in/](https://annadathasukhibhava.ap.gov.in/) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే "Know Your Status" ఎంపికపై క్లిక్ చేసి, ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. దరఖాస్తు స్థితి అక్కడే ప్రదర్శితమవుతుంది.
Details
ఫిర్యాదులకు మార్గమిదే
జాబితాలో తమ పేర్లు లేకపోతే రైతులు గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి గ్రీవెన్స్‌లో తమ వివరాలను నమోదు చేయవచ్చు. జూలై 23 వరకు ఈ అవకాశం ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పీఎం కిసాన్ నిధుల విడుదల తేదీ ఖరారయ్యే దశలో ఉంది. ఆ తేదీకే రాష్ట్ర ప్రభుత్వం కూడా సుఖీభవ మొత్తాన్ని జమ చేస్తుంది. అంటే ఏ క్షణమైనా నిధుల విడుదలపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.