Loading...
Telangana SSC Exams 2027: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు కీలక అప్‌డేట్స్.. మార్చి 17 నుంచి పరీక్షలు?
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు కీలక అప్‌డేట్స్.. మార్చి 17 నుంచి పరీక్షలు?

Telangana SSC Exams 2027: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు కీలక అప్‌డేట్స్.. మార్చి 17 నుంచి పరీక్షలు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2026
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ రెండు కీలక అప్‌డేట్స్ ఇచ్చింది. 2027లో నిర్వహించనున్న సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) పరీక్షల తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించింది. మరోవైపు, పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లలో పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో తప్పులుంటే సరిచేసుకునే ప్రక్రియను ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చింది.

వివరాలు

మార్చి 17 లేదా 18 నుంచి టెన్త్ పరీక్షలు?

పాఠశాల విద్యాశాఖ రూపొందించిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం.. 2027 మార్చి 17 లేదా 18వ తేదీన పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఏప్రిల్ 10వ తేదీతో పరీక్షలు ముగిసేలా టైమ్‌టేబుల్‌ను సిద్ధం చేశారు. మొత్తం 24 రోజుల్లో పరీక్షల ప్రక్రియ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు.

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షల మధ్య తగినంత విరామం ఉండేలా షెడ్యూల్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

వివరాలు

టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువులు

2027 ఎస్ఎస్‌సీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్షా ఫీజు చెల్లించవచ్చు.

విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించలేని వారు ఆలస్య రుసుముతో పొడిగించిన గడువుల్లో చెల్లించే అవకాశం కల్పించారు.

అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకు: ఎలాంటి ఆలస్య రుసుము లేదు.

నవంబర్ 18 నుంచి డిసెంబర్ 1 వరకు: రూ.50 ఆలస్య రుసుము.

డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 14 వరకు: రూ.200 ఆలస్య రుసుము.

డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 28 వరకు: రూ.500 ఆలస్య రుసుము.

ADVERTISEMENT

వివరాలు

సబ్జెక్టుల సంఖ్యను బట్టి పరీక్షా ఫీజు

విద్యార్థులు ఎన్ని సబ్జెక్టులకు పరీక్ష రాస్తున్నారనే దానిపై పరీక్షా రుసుము ఆధారపడి ఉంటుంది.

మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు లేదా అన్ని సబ్జెక్టులకు పరీక్ష రాసే విద్యార్థులు రూ.125 చెల్లించాలి.

మూడు సబ్జెక్టుల వరకు పరీక్ష రాసేవారు రూ.110 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇక వొకేషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు సాధారణ ఎస్ఎస్‌సీ పరీక్షా రుసుము రూ.125తో పాటు అదనంగా రూ.60 చెల్లించాలి.

ADVERTISEMENT

వివరాలు

టెన్త్ ఒరిజినల్ సర్టిఫికెట్‌లో తప్పుల సవరణ ఇక మీ సేవలోనే..

పదో తరగతి ఒరిజినల్ మెమోల్లో విద్యార్థుల పేరు,తల్లిదండ్రుల పేర్లు లేదా పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేయించుకోవడానికి ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానానికి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ స్వస్తి పలికింది. టెన్త్ సర్టిఫికెట్లలో వివరాల సవరణ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. ఇకపై మీ సేవ(MeeSeva)పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒరిజినల్ ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్లలోని వివరాల సవరణకు సంబంధించిన ప్రతిపాదనల సమర్పణ, పరిశీలన ప్రక్రియ మొత్తం మీ సేవ పోర్టల్ ద్వారానే జరగాలని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు

ఆరు దశల్లో సర్టిఫికెట్ సవరణ ప్రక్రియ

ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు విద్యార్థుల నుంచి నేరుగా సవరణ దరఖాస్తులను స్వీకరించకూడదని ఆదేశించారు.

అలాగే వాటిని విద్యాశాఖకు పంపించవద్దని స్పష్టం చేశారు. గతంలో పదో తరగతి మార్కుల మెమోలో పేరు, తల్లిదండ్రుల పేర్లు లేదా పుట్టిన తేదీని మార్చుకోవాలంటే విద్యార్థులు ముందుగా బ్యాంక్ చలాన్ ద్వారా ఫీజు చెల్లించాల్సి వచ్చేది.

అనంతరం అవసరమైన పత్రాలను జతచేసి సంబంధిత కార్యాలయాల్లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది.

ఈ విధానం వల్ల దరఖాస్తుల పరిశీలన, ఫైళ్ల కదలికలో తీవ్ర జాప్యం జరిగేది. అయితే కొత్త విధానంలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి సవరించిన కొత్త మెమో జారీ అయ్యే వరకు ప్రక్రియ డిజిటల్ పద్ధతిలో కొనసాగుతుంది.

ADVERTISEMENT