sukhbir singh Badal: పంజాబ్ రాజకీయాలను శాసించిన బాదల్ ఫ్యామిలీకి ఖలిస్థానీ ముప్పు..!
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై జరిపిన తుపాకీ కాల్పులతో దేశం షాక్‌కు గురైంది. పంజాబ్‌లో "ఫస్ట్ ఫ్యామిలీ"గా ప్రఖ్యాతి పొందిన బాదల్ కుటుంబం,రాజకీయంగా కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో దాడి జరగడం చర్చనీయాంశమైంది. సిక్కుల ప్రయోజనాల కోసం పని చేసే శిరోమణి అకాలీదళ్ పార్టీ, సుఖ్‌బీర్‌ను అధ్యక్ష పదవి నుండి తప్పించాలని, ఆయనపై ద్రోహం చేసినవాడిగా (తంఖయ్య) ఆయన్ను ప్రకటించడం ఆ ఫ్యామిలీకి పెద్ద ఎదురుదెబ్బలు.
పంజాబ్ "ఫస్ట్ ఫ్యామిలీ"గా ఓ వెలుగు వెలిగి
1947లో పంజాబ్ రాజకీయాల్లో ప్రవేశించిన ప్రకాశ్ సింగ్ బాదల్, ఆ తరువాత 1970లో మొదటి సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1977 నుంచి 2017 వరకు నాలుగు సార్లు సీఎం గా పనిచేసి, బాదల్ కుటుంబం పంజాబ్ రాజకీయాలపై బలమైన పట్టు ఉంది. ప్రకాశ్ సింగ్ బాదల్‌కు కుమారుడు సుఖ్‌బీర్ సింగ్, కుమార్తె ప్రణిత్ కౌర్ కైరాన్ ఉన్నారు.ఈ కుటుంబం పంజాబ్‌లో "ఫస్ట్ ఫ్యామిలీ"గా ప్రసిద్ధి చెందింది. సుఖ్‌బీర్ సింగ్ బాదల్,కేంద్ర మంత్రిగా,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా,ఎంపీగా పని చేశారు. ఆయన భార్య హర్ సిమ్రత్ కౌర్ కూడా కేంద్ర మంత్రిగా సేవలందించారు.సుఖ్‌బీర్ సోదరి ప్రణిత్ కౌర్, ఆమె భర్త ఆదేశ్ ప్రతాప్‌సింగ్ కైరాన్ కూడా నాలుగు సార్లు అకాలీదళ్ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు.
తండ్రి నీడలో రాజకీకీయంగా ఎదిగి
ప్రకాశ్ సింగ్ బాదల్, 1996లో కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు పటియాలా టికెట్ నిరాకరించడంతో , ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2008లో, సుఖ్‌బీర్‌కు అకాలీదళ్ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. అప్పటికి ఆయన కేవలం 45 సంవత్సరాల వయసులో ఉన్నారు. అప్పటి నుంచి అకాలీదళ్ పార్టీ నాయకత్వం ఆయన చేతుల్లోనే ఉంది.
ఖలిస్థానీ ఉద్యమం నేపథ్యంలో పరిస్థితి
ఖలిస్థాన్ ఉద్యమం, బాదల్ కుటుంబానికి సవాలుగా మారింది. 1984లో పంజాబ్‌లో ఉగ్రవాదం పెరిగినప్పుడు, బాదల్ కుటుంబం, ఖలిస్థానీ ఉద్యమాన్ని వ్యతిరేకంగా నిలబడింది. అయితే, ఇటీవల కాలంలో ఖలిస్థానీ మద్దతుదారులు సుఖ్‌బీర్‌పై స్వర్ణ దేవాలయంలో దాడి చేయడం, ఆ కుటుంబం కోసం మరింత సమస్యలు తీసుకొచ్చింది.
తంఖయ్యా (దోషి)గా ప్రకటించడంపై వివరణ
డిసెంబర్ 2న, సిక్కుల అత్యున్నత స్థానం అయిన శ్రీఅకాల్‌తక్త్ సాహెబ్, సుఖ్‌బీర్ సింగ్‌ను తంఖయ్యా (దోషి)గా ప్రకటించింది. ఆయనతో పాటు 12మంది ఇతర అకాలీదళ్ నేతలపై కూడా పుణ్య కార్యాలయాలు చేయాలని శిక్షను విధించింది. ఈ చర్యలను పాటించకపోతే, మత బహిష్కరణ కూడా జరగవచ్చు. 2007-17 మధ్య కాలంలో తీసుకున్న మతపరమైన తప్పులకు ఈ శిక్షను విధించింది. మునుపటి కాలంలో,పెద్ద రాజకీయ నాయకులు కూడా ఈ శిక్షను అనుభవించారు. మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్,కాంగ్రెస్ నేత బూటా సింగ్,మాజీ సీఎం సుర్జీత్ సింగ్ బర్నాల,కెప్టెన్ అమరీందర్ సింగ్ వంటి వారిని కూడా తంఖయ్యాలుగా ప్రకటించి,వారికి కొన్ని సామాజిక సేవలు చేయాలని ఆదేశించారు. ఇప్పుడు సుఖ్‌బీర్ కూడా స్వర్ణ దేవాలయంలో తన సేవలను కొనసాగిస్తున్నారు.