LOADING...
Andhra Pradesh: కిసాన్‌ రైల్‌తో ఏపీ నుంచి 34 వేల టన్నుల పంటల రవాణా.. లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

Andhra Pradesh: కిసాన్‌ రైల్‌తో ఏపీ నుంచి 34 వేల టన్నుల పంటల రవాణా.. లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్‌ రైల్‌ సేవల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇప్పటివరకు 116 సర్వీసులు నడిపి సుమారు 34 వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. బుధవారం లోక్‌సభలో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 2020 ఆగస్టు 7న కిసాన్‌ రైల్‌ ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా 2,364 రైళ్ల ద్వారా 7.9 లక్షల టన్నుల పండ్లు, కూరగాయలు రవాణా జరిగినట్లు తెలిపారు. ఈ సేవల ద్వారా రైల్వేకు రూ.318.68 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు.

వివరాలు 

గుంటూరు-విజయవాడ మధ్య రైల్వే రద్దీ నియంత్రణకు 4లైన్లపై సర్వే

ఆంధ్రప్రదేశ్‌ నుంచి అరటి, మామిడి, ఉల్లి వంటి ఉద్యానవన ఉత్పత్తులను అస్సాం, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ, త్రిపుర వంటి రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. రైతు సంఘాలు, సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, వ్యవసాయ మార్కెట్లతో చర్చించి కిసాన్‌ రైల్‌ సర్క్యూట్‌ను ఖరారు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గుంటూరు-విజయవాడ మధ్య పెరుగుతున్న రైల్వే రద్దీ నియంత్రణకు సంబంధించి నాలుగు కొత్త లైన్లకు డీపీఆర్‌ తయారీ కోసం సర్వే పనులకు అనుమతి ఇచ్చినట్లు అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

వివరాలు 

గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ కింద ఏపీకి అయిదేళ్లలో రూ.361 కోట్ల మంజూరు

ఈ ప్రతిపాదనల్లో బల్లార్షా-గూడూరు (విజయవాడ మీదుగా) 4వ లైన్‌ - 745 కిలోమీటర్లు, విజయవాడ-ఏలూరు 3వ, 4వ లైన్లు - 120 కిలోమీటర్లు, గుడివాడ-తెనాలి బైపాస్‌ (విజయవాడ) - 49 కిలోమీటర్లు, నల్లపాడు రైల్‌ ఓవర్‌ రైల్‌ ఫ్లైఓవర్‌ - 31 కిలోమీటర్లు ఉన్నాయని చెప్పారు. డీపీఆర్‌ పూర్తయ్యాక సంబంధిత భాగస్వామ్య పక్షాలతో చర్చించి ఈ ప్రాజెక్టులకు మంజూరు ఇస్తామని తెలిపారు. గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ ప్రాజెక్టు అమలులో భాగంగా గత అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.361 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్‌ తెలిపారు. బుధవారం లోక్‌సభలో టీడీపీ ఎంపీలు కేశినేని శివనాథ్‌, బీకే పార్థసారథి, అంబికా లక్ష్మినారాయణలు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

Advertisement

వివరాలు 

నవోదయ విద్యాలయాల్లో 7,454 మంది విద్యార్థులు

ఈ పథకం కింద మొత్తం 1,073 కిలోమీటర్ల ట్రాన్స్‌మిషన్‌ లైన్లకు గాను 888 కిలోమీటర్లు పూర్తి కాగా, 2,157 సబ్‌స్టేషన్లలో 1,968 ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 15 నవోదయ విద్యాలయాల్లో ప్రస్తుతం 7,454 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్‌ చౌధరి తెలిపారు. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు బీద మస్తాన్‌రావు ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ పాఠశాలల్లో టీచర్‌-విద్యార్థి నిష్పత్తి 1:17 నుంచి 1:19 మధ్యలో ఉందని తెలిపారు.

Advertisement

వివరాలు 

ఏపీకి మంజూరుచేసిన పిసీ కల్చర్‌ యూనిట్లలో 61% ఏర్పాటు

ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద ఆంధ్రప్రదేశ్‌కు గత అయిదేళ్లలో 2,038 పిసీ కల్చర్‌ యూనిట్లు మంజూరయ్యాయని, అయితే వాటిలో ఇప్పటివరకు 1,240 యూనిట్లు మాత్రమే (61%) ఏర్పాటు చేసినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌సింగ్‌ వెల్లడించారు. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు సానా సతీష్‌బాబు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ యూనిట్ల కోసం మొత్తం రూ.50.49 కోట్లు మంజూరైనా, అందులో రూ.17.19 కోట్లు (34%) మాత్రమే ఖర్చైనట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర వాటాగా రూ.482.55 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.

వివరాలు 

5 ఏళ్లలో 800% పెరిగిన సైబర్‌ మోసాల ఫిర్యాదులు

దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో సైబర్‌ నేరాల ఫిర్యాదులు 800 శాతం పెరిగాయని, అలాగే మోసాల వల్ల బాధితులు కోల్పోయిన మొత్తం విలువ 3,982 శాతం పెరిగినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ గొల్ల బాబూరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2021లో 2,62,846 సైబర్‌ నేర ఫిర్యాదులు నమోదవ్వగా, 2025 నాటికి అవి 24,02,579కు చేరాయని చెప్పారు. అదే విధంగా, బాధితులు కోల్పోయిన మొత్తం రూ.551 కోట్ల నుంచి రూ.22,495 కోట్లకు పెరిగిందని మంత్రి వివరించారు.

Advertisement